త్వరలోనే టీడీపీ నేతల అవినీతి బయటపెడతాం: మైదుకూరు

11 Sep, 2019 14:14 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: రాష్ట్రంలో ఏం జరిగిందని టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ అంటూ పిలుపునిచ్చారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ప్రశ్నించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తోన్న జనాదరణ చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని మండి పడ్డారు. రాష్ట్రంలో ఏం జరగకపోయినా చలో ఆత్మకూరు అంటూ పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ హయాంలో మహిళా ఎమ్మార్వోపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని రఘురామి రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే అవినీతి టీడీపీ నాయకుల బండారం బయటపెడతామని ఆయన హెచ్చరించారు.

గతంలో చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారి.. ఇక్కడి వైసీపీ నేతలను అక్రమ అరెస్ట్‌ చేయలేదా అని రఘురామి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ద్వారా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేసుకున్న నేతలు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో అందరికి తెలుసన్నారు. చంద్రబాబు అనుమతితోనే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగిలే సీఎం జగన్‌ పాలన ఉందన్నారు రఘురామి రెడ్డి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు 75శాతం హమీలను అమలు చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి 19 చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టారన్నారు.

మరిన్ని వార్తలు