టోపీ బాబు..వాగ్దానాల డాబు..

15 Mar, 2019 10:16 IST|Sakshi

అలవికాని హామీలెన్నో ఇచ్చారు.. నెరవేర్చలేక బొక్క బోర్లాపడ్డారు.. చివరకు గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారు.. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా సంపూర్తిగా నెరవేర్చలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ప్రచార ఆర్భాటమే గానీ జిల్లాకు చేసిందేమీ లేదు. వైఎస్సార్‌ హయాంలో పరుగులు పెట్టిన వంశధార, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులు చంద్రబాబు పాలనలో చతికిలపడ్డాయి. భావనపాడు పోర్టు శిలాఫలకానికి సైతం నోచలేదు. ఇలా రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. 

సాక్షి, శ్రీకాకుళం: ఈ ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో నేతల ప్రధాన హామీలేవీ అమలుగాలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ఐదేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు జిల్లా పర్యటనల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపు నెరవేరకుండాపోయాయి. ఐదేళ్ల పాలన అదిగో ఇదిగో అంటూ ఆర్భాటపు ప్రచారంతోనే గడిచిపోయింది. జిల్లాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ప్రధాన హామీలను సైతం పూర్తి చేయలేని దీనపరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. 

కుంటుపడిన వంశధార ప్రాజెక్టు
దాదాపు 19 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాంది పలికారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు 60 శాతం పూర్తయ్యాయి. వైఎస్‌ అకాల మరణంతో ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు, జిల్లా టీడీపీ నాయకులు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు పట్టించుకోలేదు. తర్వాత యూత్‌ ప్యాకేజీ తీసుకొచ్చి 18 ముంపు గ్రామాల నుంచి తరలించినా వారికి నిర్వాసిత కాలనీల్లో తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడిప్పుడే అక్కడి నిర్వాసితులు తేరుకుంటున్నారు.

మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనుల్లో ప్యాకేజీ 87 టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థే చేస్తోంది. నది నుంచి వరదకాలువకు నీరు మళ్లించే సైడ్‌ వియర్, వరద కాలువ, సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నిర్మాణ పనులను ఇప్పటికీ ఆ సంస్థ పూర్తి చేయలేకపోయింది. చంద్రబాబు సొంత మనిషైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థను అదిలించడానికి, కదిలించడానికి ఇంజనీరింగ్‌ అధికారులు పెద్దగా సాహసం చేయలేకపోయారు. గత ఏడాదే వంశధార ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలో నీరు నింపుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా నెరవేరని పరిస్థితి ఏర్పడింది.

రెండేళ్ల క్రితం హిరమండలంలో బహిరంగసభకు హాజరైన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంశధార నిర్వాసితులకు అభయమిచ్చిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ప్రాజెక్టు పెండింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘నవరత్నాల్లో’నూ పునరుద్ఘాటించారంటే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. 

కలగా మిగిలిన ‘ఆఫ్‌షోర్‌’
మహేంద్ర తనయ నది నీటిని సద్వినియోగం చేసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకూ నాంది పలికారు. దీన్ని కూడా 2018 డిసెంబరు నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ నేటికీ ఆ ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తికాలేదు. ఈ పరిస్థితి తలెత్తడానికి శివాజీ అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి మితిమీరిన జోక్యం కూడా ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. ఇక వంశధార నది కరకట్టల నిర్మాణ పనులకు తొలి నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శంకుస్థాపన చేసి మమ అనిపించారు.

పనులు మాత్రం మొదలవ్వలేదు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం చేశామని ఒకవైపు చంద్రబాబు, టీడీపీ నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నా ఇక్కడి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వంశధార ప్రాజెక్టులోని హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్ట వరకూ నిర్మిస్తున్న హైలెవల్‌ కెనాల్‌ (హెచ్‌ఎల్‌సీ) పనులు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. అలాగే ఆమదాలవలస, రాజాం నియోజకవర్గ రైతులకు కీలకమైన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపడతామని గత మూడేళ్లుగా ఊరిస్తున్న టీడీపీ నాయకులు చివరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇటీవలే మొక్కుబడిగా ముగించిన సంగతి తెలిసిందే. 

భావనపాడుపై నాన్చుడు ధోరణి
టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి, పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం సరిహద్దులో భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తామంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ నేటికీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఈ పోర్టును ప్రైవేట్‌ సంస్థ ఆదానీకి అప్పగిస్తూ గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంఓయూ కుదిరింది. అయితే శంకుస్థాపన మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇటీవల భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమం సమయంలోనే భావనపాడు పోర్టు శిలాఫలాకాన్నీ అక్కడే చంద్రబాబుతో ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అదీ ఆఖర్లో ఆగిపోయింది.

సుగర్స్‌ రైతుల నోట్లో చేదు
ఆమదాలవలస కోఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, కూన రవికుమార్‌ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు హంగామా చేశారు. తీరా అది సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఆమదాలవలసలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో తేల్చిచెప్పేశారు. అక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ అదీ కార్యరూపం దాల్చలేదు. 

సిక్కోలుపై చిన్నచూపు
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవడానికి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. నగరం చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని, సిటీలో మురుగు సమస్య నిర్మూలించేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలోనే కాదు నగరానికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు హామీ ఇస్తూనే వచ్చారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. కనీసం నగరం నడిబొడ్డున పశుసంవర్థక శాఖ స్థలంలో నిర్మించిన 30 షాపుల వ్యాపార సముదాయాన్ని కూడా ప్రారంభించలేదు. చేనేత వృత్తిదారులకు ప్రథమ ప్రాధాన్యంతో కేటాయిస్తామని అధికారులు.. కాదు తమవారికే దక్కాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.   

మరిన్ని వార్తలు