అన్ని విద్యా సంస్థలకు 2022 నాటికి న్యాక్‌

16 Nov, 2018 01:12 IST|Sakshi

గుర్తింపు తప్పనిసరి చేసేందుకు యూజీసీ కసరత్తు  

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణల పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు 2022 నాటికి నేషనల్‌ అసేస్‌మెంట్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

ఇందుకోసం ‘పరాంశ్‌’పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఇండియన్‌ యూనివర్సిటీల భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనుంది. వాటిని మెంటార్‌ సంస్థలుగా ఎంపిక చేసి, ప్రతి విద్యా సంస్థ న్యాక్‌ గుర్తింపు పొందేలా చేయాలని నిర్ణయించింది. న్యాక్‌ గుర్తింపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి? ఉత్తమ ప్రమాణాలుగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాలపై ఆయా విద్యా సంస్థలు న్యాక్‌ గుర్తింపు కోరుకునే కాలేజీలకు మార్గదర్శనం చేయనున్నాయి.

మొత్తానికి 2022కి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం న్యాక్‌ 2.5 మినిమమ్‌ స్కోర్‌నైనా సాధించేందుకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు కృషి చేసేలా పరాంశ్‌ అమలుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే కేంద్ర ఆర్థిక సహాయం, గ్రాంట్లు, ఇతర పరిశోధన నిధులు ఇచ్చేలా చర్యలు చేపట్టిన కేంద్రం, తాజా నిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది.  

మరిన్ని వార్తలు