ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. నమ్మలేని నిజాలు!

21 Dec, 2018 14:31 IST|Sakshi
సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చిట్టిబాబు, సీతారామరాజు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీ రామారావు జీవితకథను తెరకెక్కించాలంటే రాంగోపాల్‌ వర్మే తీయాలని సీనియర్‌ జర్నలిస్ట్‌, సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు నడింపల్లి సీతారామరాజు అభిప్రాయపడ్డారు. రాముడు గురించి సినిమా తీయాలంటే రామూనే తీయాలన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘వెన్నుపోటు’ పాటను విడుదల చేయనున్నట్టు రాంగోపాల్‌ వర్మ ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఆడియో కూడా ఈరోజు సాయంత్రమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు, సీతారామరాజు పాల్గొన్నారు.

చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ అనుభవించిన క్షోభపై చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘అధికారంతో పాటు కుటుంబాన్ని తనకు చంద్రబాబు దూరం చేశాడని ఎన్టీఆర్‌ చాలా బాధ పడ్డారు. తన కుమారుల్లో అత్యంత ఇష్టుడైన హరి​కృష్ణను కూడా దూరం చేయడంతో మరింత కుంగిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. కుతూహలమ్మకు వెన్నుపోటు పొడిచి నాయకుడయ్యారు. ప్రజాపోరాటాలు చేసి నాయకుడు కాలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఓడిపోవడంతో గోడ దూకి టీడీపీలోకి వచ్చేశాడు. 30 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్‌ పార్టీతో మళ్లీ ఇప్పుడు చేతులు కలిపాడు. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టి, ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చరిత్రలో జరిగిన విషయాలన్నీ బాలకృష్ణకు తెలుసు. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి వంశం నాశనమైపోతుందన్న భ్రమను ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు కల్పించారు. పార్టీని, కుటుంబాన్ని కాపాడతానని నమ్మించడంతో ఎన్టీఆర్‌ వారసులు చంద్రబాబు వెనుక నడిచారు. చంద్రబాబు చేసిన ద్రోహం గురించి తెలిసినా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఎన్టీఆర్‌ వారసులు ఉన్నార’ని వెల్లడించారు.  

చివరి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు?
ఎన్టీఆర్‌ మొదటి, చివరి ఇంటర్వ్యూలు తనకు ఇచ్చారని సీతారామరాజు వెల్లడించారు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు తనకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ చెప్పారని తెలిపారు. తిరుపతిలో మేజర్‌ చంద్రకాంత్‌ ఫంక్షన్‌ జరిగినప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించకుండా చంద్రబాబు ఒత్తిడి చేసినా, పెద్దాయన వినిపించుకోలేదన్నారు.

‘నేను చేసింది తప్పా అని ఎన్టీఆర్‌ తర్వాత నన్ను అడిగారు. నేను తప్పేంలేదని చెప్పాను. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కూడా మిమ్మల్ని పిలిచి కుప్పంలో ఎన్నికల ప్రచారం చేయించారు. రాష్ట్రమంతా తిప్పారు. మిమ్మల్ని అభినందించారు. కేబినెట్‌లో తనకు మంచి పదవిక ఇమ్మని లక్ష్మీపార్వతితో మీకు చెప్పించారు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు మాతో ఒకరని చెప్పారు. పెళ్లి విషయంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ ఆదర్శమని నాతో చెప్పారు. లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్‌కు ఎటువంటి హాని జరగలేదు. వాస్తవానికి ఎన్టీఆర్‌ ఒక్కరికే కాదు ఆయన కుటుంబం మొత్తానికి వెన్నుపోటు జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఎన్టీఆర్‌ కుటుంబంలో ఒక్క బాలకృష్ణ తప్పా ఎవరి ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎన్టీఆర్‌ ఇళ్లు అన్ని అమ్మేశారు. ఆయనకు సంబంధించినవి ఏవీ లేకుండా చేశారు.

ఎన్టీఆర్‌ తర్వాత హరి​కృష్ణను వెన్నుపోటు పొడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ పెళ్లిలో హరికృష్ణను కలిశాను. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయన ఎంతో బాధ పడ్డారు. కథానాయకుడు సినిమాలో హరికృష్ణ కుమారులను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. మలక్‌పేట నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయాలని హరికృష్ణ అనుకున్నారు. కేసీఆర్‌తో మాట్లాడినట్టు కూడా నాతో చెప్పారు. ఆయనకు కేబినెట్‌ పదవికి కూడా నిర్ణయమైంది. నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను మీకు అదే పదవి ఇస్తానని కేసీఆర్‌ తనతో అన్నారని హరికృష్ణ చెప్పారు. ఎందుకంటే వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. హరికృష్ణను మళ్లీ పైకి తీసుకువాలన్న భావన ఇంట్లోవారి కన్నా కేసీఆర్‌కే వచ్చింది. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే కేసీఆర్‌ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌ ఏమీ సంపాదించలేదు. బయోపిక్‌లను తీయడంలో రాంగోపాల్‌ వర్మ ఎక్స్‌పెర్ట్‌. ఆయన తెరకెక్కించే సినిమాలో వాస్తవాలు చూపిస్తారని నమ్ముతున్నాన’ని సీతారామరాజు వివరించారు.

మరిన్ని వార్తలు