నాగబాబు బూతు బుసలు

4 May, 2019 08:37 IST|Sakshi

పవన్‌ను విమర్శించిన వారు సన్నాసులు.. గాడిదలు..     వెధవలట!

ఇతర పార్టీలకు ప్రచారం చేసిన నటులంతా పెయిడ్‌ ఆర్టిస్ట్‌గాళ్లంట!!

గాజువాక సమావేశంలో ఆయన గారి తిట్ల పురాణం

దుమారం రేపుతున్న  వివాదాస్పద వ్యాఖ్యలు

మండిపడుతున్న రాజకీయవర్గాలు

పనికిమాలిన సన్నాసులు.. అడ్డగాడిదలు.. వెధవలు.. రాస్కెల్స్‌.. ఒరేయ్‌..!!ఇవన్నీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం లోక్‌సభ అభ్యర్ధి, సినీ నటుడు.. ఇంకా చెప్పాలంటే జబర్దస్త్‌ ఫేమ్‌ నాగబాబు అలియాస్‌ నాగేంద్రబాబు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు..రాజకీయాలన్న తర్వాత విపక్ష, అధికారపక్ష నేతలు మాటలు విసురుకోవడం.. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం సహజమే.. కానీ  ప్రత్యర్థి పార్టీల నేతలనుద్దేశించి నోటికొచ్చినట్టు దారుణమైన పదజాలం వాడిన నాగబాబు వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మేడే సందర్భంగా గాజువాకలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇది జరిగి నాలుగురోజులైనా.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆ బూతు పురాణంపై వివాదం నలుగుతోంది. విపక్షనేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన నాగబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు, ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ వ్యక్తిత్వ హననానికి తెగబడుతూ నోటికొచ్చినట్టు బూతుమాటలు, పరుష పదజాలం ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో కొంత కనిపించింది. కానీ ఏపీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా ఎదురుకాలేదు. పవన్‌కల్యాణ్‌ ఊగిపోతూ చేసిన ఆవేశపూరిత ప్రసంగాల్లో అరుపులు, కేకల మధ్య అడపాదడపా హద్దులు దాటినా.. అవి పెద్దగా ఎవరికీ వినిపించలేదు. ఎవరూ పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఆయన సోదరుడు నాగబాబు చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

మేడే నాడు.. బుధవారం పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాకలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాగబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి జేడీ అలియాస్‌ వీవీ లక్ష్మీనారాయణ సహా జనసేన నేతలంతా హాజరై పవన్‌కల్యాణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో తప్పేమీ లేదు. ఎవరికీ అభ్యంతరాల్లేవు. వారి అధినేతను వారు ప్రశంసలు, అభినందనలతో ముంచెత్తడం వారిష్టం. కానీ అదే సమావేశంలో పవన్‌ సోదరుడు నాగబాబు అదుపుతప్పి చేసిన వ్యాఖ్యలు, విపక్ష నేతలనుద్దేశించి పఠించిన తిట్ల పురాణాలపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నాగబాబూ.. ఇదేనా జనసేన విలువల రాజకీయం
నా తమ్ముడు కల్యాణ్‌బాబును విమర్శించినోళ్ళు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు, రాస్కెల్స్‌.. అని నాగబాబు నోటికొచ్చినట్టు మాట్లాడారు. విపక్ష పార్టీల తరఫున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్‌ ఆర్టిస్టుగాళ్ళు అని నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే దుమారం రేగుతోంది. సోదరుడిగా పవన్‌ కల్యాణ్‌ గురించి నాగబాబు గొప్పగా చెప్పుకున్నారు. తాను ఎలా పోయినా ఫర్వాలేదని, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వందేళ్ళు బతకాలని కోరుకున్నారు. ఇండియాలోనే పవన్‌ గొప్ప నాయకుడని చెప్పుకున్నారు. ఇలా తన తమ్ముడి గురించి ఎంతసేపు, ఎన్ని మాట్లాడుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ విపక్ష నేతలనుద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. నేను చదువుకున్నాను.. హిస్టరీ స్టూడెంట్‌ను.. అని అదే ప్రసంగంలో చెప్పుకున్న నాగబాబు విజ్ఞత, సంస్కారం ఇవేనా అన్న ప్రశ్నలు  వినిపిస్తున్నాయి. పవన్‌పై రాజకీయంగా విమర్శలు చేసిన వారికి బదులుగా నాగబాబూ కూడా విమర్శలు చేసుకోవచ్చు. ఆరోపణలు చేయొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయాలు మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బండబూతులు తిట్టడమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

నాగబాబూ..  నోరు అదుపులో పెట్టుకో..
‘చంద్రబాబునాయుడు ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మీ తమ్ముడికి, మీకు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలను  విమర్శించే నైతిక హక్కు లేదు.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని జనసేన నాయకుడు, సినీనటుడు  నాగబాబును   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతే స్పందించిన పవన్‌ కల్యాణ్, ఆంధ్రాలో నారాయణ, చైతన్య స్కూల్‌ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదని విమర్శించారు. నగరంలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో పవన్, వీవీ లక్ష్మీనారాయణ  ఓడిపోతారనే భయంతోనే జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులేవీ నిలబడవని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. 

చంద్రబాబు ప్యాకేజీల కోసమే పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సీన్‌లో నటించారని, ఎన్నికల అనంతరం ఏసీ రూమ్‌ల్లో  గడుపుతూ ప్రజాసమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజాసంకల్పయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి అశేష ప్రజాదరణ పొందారని గుర్తుచేశారు. త్వరలో ఆయనను ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని చెప్పారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై  జగన్, విజయసాయిరెడ్డి  ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారని, ఎన్నికల్లో అవకతవకలు, రీ ఎలక్షన్, ఈవీఎంలు, వీప్యాడ్‌ తదితర వాటిపై పవన్‌ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.  లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ఏపీలో రిలీజ్‌ కాకుండా చంద్రబాబు రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్, చంద్రబాబు, నాగబాబుల విమర్శల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రామరాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రజలు భావించి వైఎస్సార్‌సీపీని ఆదరించారని, అధిక మెజార్టీతో జగన్‌ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

కారుకూతలు మానుకోవాలి
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు ఎంతో ప్రజాదరణ ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయం.  నాగబాబుతో పాటు ఆయని సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు అమ్ముడుపోయే రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లు. చంద్రబాబు గెలుపుకోసం అమాయక అభిమానుల  మనోభావాలను వీరు తాకట్టు పెట్టారు. కేవలం ప్యాకేజీల కోసం రాష్ట్రంలో వీరు రాజకీయాలు చేస్తున్నారు. నరస్సాపురంలో తన ప్రత్యర్థి పోటీదారులు ఎవరో కూడా నాగబాబుకు తెలియని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్‌కు పోటీ చేయడం అక్కడి ప్రజల దురదృష్టం. నాగబాబుకి జగన్‌ను విమర్శించే నైతికహక్కులేదు. హుందా రాజకీయాలు ఆయన నేర్చుకోవాలి. మతిస్థిమితం లేని ఇలాంటి వారిని ప్రజలు రాకీయాలకు దూరంగా ఉంచాలి.  – కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సాఆర్‌సీపీ

జబర్దస్త్‌ షో అనుకున్నావా.. 
బాబూ నాగబాబూ.. రాజకీయాలంటే నువ్వు టీవీల్లో చేసే జబర్దస్త్‌ షో అనుకున్నావా.. నువ్వు నటుడై ఉండి.. మీ సకుటుంబ సపరివారమంతా నటీనటులై ఉండి.. సాటి నటులను పెయిడ్‌ ఆర్టిస్టుగాళ్ళు అంటావా..  అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జాన్‌ వెస్లీ ప్రశ్నించారు. నటులంతా మీ వెంటే తిరగాలా.. రాజకీయంగా వారికి వ్యక్తిగత ఇష్టాలు, పార్టీలు ఉండకూడదా.. అని ప్రశ్నించారు. తనకు నచ్చని విధానాలపై, పార్టీలపై నాగబాబుకు విమర్శించే హక్కుంది. కానీ ఇలా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్టు మాట్లాడటం అతని స్థాయిని బయటపెట్టింది. వెంటనే నాగబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి.. అని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. - జాన్‌ వెస్లీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి  

మరిన్ని వార్తలు