సంక్షేమానికే పట్టం

5 Apr, 2019 08:53 IST|Sakshi

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

రైతులకు మేలు చేశారు

దేశ భద్రత మోదీకే సాధ్యం

‘సాక్షి’ రోడ్డుషోలో జనం మనోగతం

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నాయని, ఈ పథకాలు దేశంలో కూడా అమలు కావాలంటే టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలవాల’ని పలువురు అభిప్రాయపడ్డారు. కార్కొండకు చెందిన వెంకటయ్య ‘కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.8 వేలు ఇస్తూ ఆదుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి? లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తాం’ అని కుండబద్ధలు కొట్టారు. నాగర్‌కర్నూలు – మన్ననూరు (శ్రీశైలం రోడ్డు) రహదారిపై ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు పనితీరుపై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, దేశ రక్షణ దృష్ట్యా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, మళ్లీ మోదీ ప్రధాని కావాలని కూడా ఆకాంక్షించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పి.రాములు (టీఆర్‌ఎస్‌), మల్లు రవి (కాంగ్రెస్‌), బంగారు శ్రుతి (బీజేపీ) తలపడుతుండగా, ఈ నియోజకవర్గ ప్రజల మనోగతం ఇలా ఉంది..నాగర్‌కర్నూలు– సాక్షి, నెట్‌వర్క్‌

టీఆర్‌ఎస్‌కే మద్దతు ఎందుకంటే..: రోడ్డు షోలో భాగంగా శ్రీశైలం రహదారిలో ప్రయాణించిన ‘సాక్షి’ బృందం.. ఆ రహదారిపై వెళ్తున్న పలువురిని వివిధ అంశాలపై పలకరించింది. ఏ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలనుకుంటున్నారు?, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు?, లోక్‌సభ ఎన్నికల్లో మీ ప్రాంతానికి సంబంధించిన ప్రభావం చూపే ప్రధానాంశం ఏమిటి?, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?.. అనే అంశాలపై ప్రశ్నించింది. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి టీఆర్‌ఎస్‌ పలు సీట్లలో గెలుస్తుందని చెప్పిన వారు.. కేంద్రంలో మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని అవుతారని బదులిచ్చారు. కోమటికుంటకు చెందిన జయంత్‌రెడ్డి ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాములు సౌమ్యుడు. అలాంటి వ్యక్తి గెలిస్తే లోక్‌సభ పరిధిలో అభివృద్ధి జరుగుతుంది’ అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన పాల ఉత్పత్తిదారుడు గువ్వల నర్సింహ, గుమ్మకొండకు చెందిన వ్యాపారి షేక్‌ మహబూబ్‌పాషా, బిజినేపల్లికి చెందిన కృష్ణమూర్తి.. ‘రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అన్ని విషయాల్లోనూ బాగుంద’ని కితాబునిచ్చారు.

మోదీ మళ్లీ రావాలి: ‘ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉగ్రవాదమని, దాని నుంచి దేశాన్ని బీజేపీ మాత్రమే కాపాడగలుగుతుంద’ని చెప్పిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. తెలకపల్లి రాకొండ గ్రామానికి చెందిన కృష్ణయ్యగౌడ్‌ మాట్లాడుతూ ‘గతంలో ప్రధానమంత్రులుగా చేసిన వారెవరూ పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను ఏరి పారేసిన ఉదంతాలు లేవు. మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్‌ లాంటి ఉగ్ర దేశాలకు సరైన బుద్ధి చెప్పారు. ఆయన నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుంది’ అన్నారు. మోదీ విధానాల వల్ల చిన్నపాటి వ్యాపారులకు రుణాలందాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కమ్మరెడ్డిపల్లికి చెందిన ఆవుల రామకృష్ణ ‘చిరు వ్యాపారుల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి మోదీ’ అని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు, అభివృద్ధికి తీసుకుంటున్న దీర్ఘకాలిక చర్యలు మునుముందు మరిన్ని ఫలితాలనిస్తాయని పలువురు చెప్పారు. ‘మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశానికి మరో ఐదేళ్ల సుస్థిర పాలన అందుతుంది’ అని తెలకపల్లికి చెందిన రవిగౌడ్‌ అభిప్రాయ పడ్డారు.

ప్రత్యామ్నాయం : ప్రస్తుతం దేశాన్ని ఇప్పటి వరకు పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశాభివృద్ధికి పాటుపడలేదని, కేంద్రంలో ప్రత్యామ్నాయం వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. తెలకపల్లి మండలం గడ్డంపల్లికి చెందిన రమేష్‌శెట్టి ‘థర్డ్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదీ కేసీఆర్‌ నేతృత్వంలో రావాలి’ అన్నారు. మరికొందరు కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని ఆకాంక్షించారు. ఇంకొందరు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని చెబుతున్నా.. కేంద్రంలో మాత్రం నరేంద్రమోదీనే ప్రధాన మంత్రి కావాలని కోరుకున్నారు. మరికల్‌కు చెందిన మేస్త్రీ దశరథం.. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ ఇక్కడ మాత్రం టీఆర్‌ఎస్‌ ఎంపీ గెలవాలి. అలా అయితేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి, సాగునీరు వస్తుంది’ అన్నారు.తిమ్మాజిపేటకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ‘టీఆర్‌ఎస్‌ అభివృద్ధి పనులు బాగా చేస్తోందని, మళ్లీ ఆ పార్టీకే మద్దతునిస్తా’నని చెప్పారు. కానీ కేంద్రంలోకాంగ్రెస్‌ వస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.

రోడ్డు షో.. రూటిదీ
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే నాగర్‌కర్నూల్‌– శ్రీశైలం రహదారిపై ‘సాక్షి’ బృందం దాదాపు 50 కిలోమీటర్ల మేర పర్యటించింది.
తిమ్మాజిపేట మండలం మరికల్‌ నుంచి తెలకపల్లి మండలం రాకొండ వరకు గల ఈ దూరంలో.. రహదారి పక్కన ఉన్న వివిధ వర్గాల ప్రజలను, ప్రయాణికులను, వ్యాపారులను, రైతుల స్పందనను ఈ బృందం తెలుసుకోగలిగింది.
50 కి.మీ. దూరాన్ని 10 రూట్లుగా విభజించుకుని.. ఒక్కో రూట్లో కనీసం 10 నుంచి 20 మంది అభిప్రాయాన్ని కోరింది. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత, రైతులు, కూలీలు.. ఇలా దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగింది.
ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి?, ఏ పార్టీ గెలుస్తుంది?, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తదితర ప్రశ్నలకు స్పందన కోరింది.

మా కోసం కూడా ఏదైనా..
కులవృత్తిపైనే ఆధారపడ్డ కుమ్మరుల బతుకులుఛిద్రమవుతున్నాయి. కుండల అమ్మకం చాలా తగ్గింది. కుండల తయారీ మా తరంతోనే అంతరించేలా ఉంది.వివిధ కులాలకు ఇస్తున్నట్టుగానే టీఆర్‌ఎస్‌ సర్కారు
మా కోసం ఏదైనా చేయాలి.– కుమ్మరి వెంకటయ్య, ఎండబెట్ల

‘మద్దతు’ వద్దు.. గిట్టుబాటు కావాలె
నాకున్న కొద్ది భూమిలో వరి, వేరుశనగ, కూరగాయలు సాగు చేశాం. గిట్టుబాటు కాకపోవడంతో రోజూ ఇక్కడే ఉండి కిలోలెక్కన అమ్ముకోవాల్సి వస్తుంది. సర్కారోళ్లు రైతులకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర అందిస్తే మేలు జరుగుతుంది.– బోనాసి లక్ష్మి, కూరగాయల రైతు,తిర్మలాపూర్‌

రైతుబంధు మంచిగుంది
నా మద్దతు టీఆర్‌ఎస్‌కే. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తోంది. రైతుబంధు ద్వారా నాకు డబ్బులు వచ్చాయి. నాలాగా మరెందరో రైతులు సంతోషంగా ఉన్నారు. కేంద్రంలో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుంది.– సత్యనారాయణ, రైతు, తిమ్మాజిపేట

మంచి  చేసే వారికే..
నాకు ఓటు హక్కు వచ్చి మూడేళ్లయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లోటీఆర్‌ఎస్‌కే మద్దతునిచ్చా. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అందరూ ఓటు అడుగుతున్నారు. పేదలకు మంచి చేసే వారికే నా ఓటు.
– గంటా శంకర్, బొమ్మన్పల్లి

వీధి వ్యాపారులకు ఉపాధి
చాలా ఏళ్లుగా రోడ్డుపైనే మా బతుకు జట్కాబండి నడుస్తోంది. ఎండనక, వాననక, వణుకుతూ జీవనం సాగిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం గిరాకీ కూడా తగ్గింది. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి.– పోలేపల్లి లక్ష్మమ్మ,చాటల వ్యాపారి, నాగర్‌కర్నూల్‌

గుర్తింపు కార్డులివ్వాలి..
కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇచ్చి రుణాలను అందించాలి. కానీ చాలాకాలంగా రోడ్డు సైడ్‌ వ్యాపారాలతో బతుకీడుస్తున్న మాకు గుర్తింపు కార్డుల్లేవు. రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలున్నాయనే నెపంతో ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం బ్యాంకు రుణాలైనా ఇప్పిస్తే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే  బాధ తప్పుతుంది.
– తన్నీరు మురళి, చిరు వ్యాపారి

సమ న్యాయం జరగాలంటే..
రైతులను పట్టించుకునేది కాంగ్రెస్సే. అందుకే ఆ పార్టీనే అధికారంలోకి రావాలి. రాహుల్‌ ప్రధాని కావాలి. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న మల్లు రవిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపుతాం.  
– మొగులాలుగౌడ్, పర్వతాపూర్‌

మరోసారి ఆయనే..  
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి మరోసారి రావాలి. ఆయన ఉద్యోగాలు ఇచ్చేందుకు అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. దూరదృష్టితో చేపడుతున్న పనులు సఫలమైతే రానున్న ఐదేళ్లలో అనేక లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని నమ్ముతున్నా. నరేంద్రమోదీ గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.– సత్యనారాయణ, మంతటి

మరిన్ని వార్తలు