తండ్రి అధికారంతో అరాచకాలు సృష్టిస్తున్న కొడుకు

1 Apr, 2019 11:27 IST|Sakshi

తండ్రి అధికారంతో అరాచకాలు సృష్టిస్తున్న కొడుకు

పెందుర్తిలో అసాంఘికశక్తిగా మారిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’

అంతులేని అక్రమాలు.. అవినీతి బాగోతాలు

ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు

జెర్రిపోతులపాలెం దళిత మహిళ వివస్త్ర ఘటనకు సూత్రధారి

ప్రతిపక్షం చేసిన మంచి పనులను అడ్డుకుంటున్న వైనం

పెందుర్తి నియోజకవర్గంలో అరాచకశక్తిగా ఎదిగిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఈ ఐదేళ్లలో సాగించిన దురాగతాలకు ఈ ఘటనలు ఉదాహరణలు. ఇవే కాదు గత ఎన్నికల సమయంలో తండ్రి సత్యనారాయణమూర్తి ఇచ్చిన అబద్ధపు హామీలను కప్పిపుచ్చుతాడు.. పంచగ్రామాల భూ సమస్యను వంద రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి ఓట్లేయించుకున్న తండ్రిని ఎవరైనా నిలదీస్తే అక్రమంగా జైలుకు పంపుతాడు. ముదపాక భూముల వ్యవహారంపై తండ్రిని ప్రశ్నిస్తే చంపుతాను అని బెదిరిస్తాడు.. ఏదైనా సమస్యపై జనం అడిగితే మధ్యలో కలుగజేసుకుని ప్రజలను ఛీదరించుకుంటాడు.. ఇక తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సెటిల్‌మెంట్‌లు, మామూళ్ల వసూళ్లు, భూకబ్జాలకు పాల్పడుతుంటాడు. నియోజకవర్గంలో ‘తండ్రి శాంక్షన్‌–కొడుకు కలెక్షన్‌’ లాంటి గొప్ప ఘనతను సొంతం చేసుకున్న సన్నాఫ్‌ సత్యమూర్తి ఖాతాలో ఇలాంటి జాబితా చాంతాడంత ఉందని పెందుర్తిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఓ సారి చిట్టాను పరిశీలిద్దాం..

విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికారం బండారు సత్యనారాయణమూర్తిదే.. కానీ ఏ పని జరగాలన్నా ఆయన పుత్రరత్నం అనుమతి, అనుగ్రహం తప్పనిసరి. ఎంతటి ఉన్నతాధికారి అయినా ‘నాయుడు బాబు’ చెప్పినట్లు తలవంచాలి. ఒక్కో సందర్భంలో 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బండారు సైతం ఉత్సవ విగ్రహం మాత్రమే. ఈ ఐదేళ్లలో ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ బండారు ఉంటే పక్క సీటు.. లేకపోతే ఎమ్మెల్యే సీటు అతడిదే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకోవడం.. అనుచరులతో కలిసి భూకబ్జాలు చేయడం నాయుడు బాబుకు వెన్నతో పెట్టిన విద్య. హిందుజా పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగ స్థాయి బట్టి కనీసం రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు వెనకేసుకున్నాడన్న ఆరోపణలు బహిరంగంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముదపాక భూముల వ్యవహారాన్ని అప్పలనాయుడే చూసుకున్నాడన్న ఆరోపణ ఉంది. టీడీపీ నాయకులకు ‘చిల్లర’ పడేసి రైతుల భూ పట్టాలు లాక్కున్నాడని అప్పట్లో బాధితులు ఆరోపించారు. దానిపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టగా తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించిన ఘనత బండారు సుపుత్రుడిది. గుర్రమ్మపాలెంలో ఏపీఐసీసీ సేకరించిన భూమిలో బండారు బినామీలతో 25 ఎకరాలకు నష్టపరిహారం పొందినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. ఇక్కడ ఎకరాకు రూ.23 లక్షలు ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగాల పేరిట దాదాపు రూ.3 కోట్లపైనే చినబాబు వసూలు చేశాడట. కానీ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో నియామకాలు జరగలేదు. దీంతో నిరుద్యోగుల డబ్బు తిరిగి ఇవ్వకుండా అప్పలనాయుడు జల్సా చేశాడట.

ఇంకాచదవండి...
నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పెద్ద భవనం నిర్మాణం జరిగిన ఇతడికి వాటా ఉండాల్సిందే. ముఖ్యంగా పెందుర్తి పట్టణ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం బాబుకు గుడ్‌విల్‌ చెల్లించకుండా పూర్తికాదు. ఇలా ఈ ఐదేళ్లలో ఓ రూ.10 కోట్లు వెనకేసుకున్నాడట. నీరు–చెట్టు వాటాల్లో భాగంగా ఈ ఐదేళ్లలో ఆరేడు కోట్లు అతడి ఖాతాలో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతారు. హిందుజా కంపెనీకి నిత్యం సగటున 300 లారీలు బొగ్గును తరలిస్తాయి. కనిష్టంగా రోజుకు ఆ లారీల నుంచి తండ్రీకొడుకులు రూ.లక్ష వసూలు చేస్తారట. పరవాడ, పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక వ్యాపారంలో రోజూ వీరికి మామూళ్లు వెళ్లాల్సిందే. బండారు, అతని కొడుకు అండదండలతో వందలాది ఎకరాల భూమిని టీడీపీ నాయకులు సొంతం చేసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో కొట్టేసిందే అధికం. ఇలా దాదాపు రూ.500కోట్లపైనే టీడీపీ నాయకులు పంచుకున్నారు. పినగాడి వద్ద ఓ ప్రయివేటు భూమిలో రికార్డులు తారుమారు చేసి సొంత పార్టీ నాయకులనే తన బృందంతో ఇబ్బంది పెట్టాడు. అప్పట్లో తహసీల్దార్‌ స్థాయి వ్యక్తి ఇరువురికి మధ్యవర్తిత్వం వహించినా..అప్పలనాయుడు తప్పుడు వ్యక్తులకే వత్తాసు పలికాడు. దీంతో అదే పార్టీకి చెందిన బాధితుడు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారి ఆస్తుల వ్యవహారాల్లో తలదూర్చడం అతడికి అలవాటు. అలా అనేక గొడవల్లో తన అనుచరులను మధ్యలో పెట్టి కుటుంబాలను విడదీసిన ఘనత చినబాబుది. సన్నాఫ్‌ సత్యమూర్తి సెటిల్‌మెంట్‌లకు, ‘పార్టీ’లకు సుజాతనగర్‌లో ఓ డెన్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులోనే అన్ని ‘కార్యక్రమాలు’ ఐదేళ్ల పాటు నిరాటంకంగా సాగుతూ.... నే ఉన్నాయి.

పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం..
2017 డిసెంబర్‌ 19 వరకు ఈ ఊరు మండలంలో తప్ప ఎవరికీ పెద్దగా తెలీదు.. కానీ ఆ మరుసటి రోజు నుంచి దేశంలో ప్రతీ చోటా ఈ గ్రామం గురించే చర్చ.. కారణం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొడుకు అప్పలనాయుడు ప్రోద్భలంతో టీడీపీ నాయకులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన తీరు. ఈ ఘటనను ఓ సారి పరికిస్తే.. గ్రామంలో నిరుపేదలైన దళితుల భూమిపై అధికార పక్షానికి  చెందిన మోతుబారి నాయకుల కళ్లు పడ్డాయి. అంతే బండారు అండ.. కొడుకు ప్రత్యక్ష పర్యవేక్షణతో ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో ఓ జాబితా సిద్ధం చేసేశారు. వారి చెప్పు చేతల్లో ఉన్న రెవెన్యూ అధికారులతో దాన్ని ఆమోదింపజేసుకున్నారు. అధికారమదంతో దళితులపై దండెత్తారు. అడ్డొచ్చిన దళిత మహిళను దారుణంగా కొట్టి వివస్త్రను చేసి దుశ్శాసనపర్వానికి తెరతీశారు.

సబ్బవరం మండలం సాయినగర్‌కు చెందిన నాయుడు అనే 22 ఏళ్ల యువకుడికి అర్ధరాత్రి కడుపునొప్పి వచ్చింది. స్థానిక పీహెచ్‌సీలోని అంబులెన్స్‌ కదిలే పరిస్థితి లేకపోవడం, 108 వాహనం రాకపోవడంతో చికిత్స ఆలస్యమై మృతిచెందాడు. దీనిపై తీవ్ర కలత చెంది భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదన్న తలంపుతో వైఎస్సార్‌ సీపీ నేత అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన సొంత నిధులతో పీహెచ్‌సీకి అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ మరుసటి రోజే దాన్ని పీహెచ్‌సీకి అప్పగిస్తూ జీవితకాలం ఆ అంబులెన్స్‌ నిర్వహణ బాధ్యత తనదే అంటూ అదీప్‌ ప్రకటించారు. అయితే విషయం తెలుసుకున్న బండారు, అతని కొడుకు ఆ అంబులెన్స్‌ తీసుకుంటే మీ ఉద్యోగాలు ఉండవు అంటూ డాక్టర్లను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆ వాహనాన్ని తిరిగి పంపేశారు డాక్టర్లు. తండ్రీ కొడుకుల వక్రబుద్ధి కారణంగా నేటికీ సబ్బవరంలో అంబులెన్స్‌ సదుపాయం లేదు.

మరిన్ని వార్తలు