ఉత్తమ్‌ మళ్లీ గెలవడు: నాయిని

15 Sep, 2018 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ సారి ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలవడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉత్తమ్‌ మంత్రిగా ఉన్నప్పుడు గృహనిర్మాణ శాఖలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ టీడీపీ నేతలు ఆ పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్‌ ఆత్మకు క్షోభ కలిగిస్తున్నారు. సీపీఐ, సీపీఎం వారి సిద్ధాంతాలను పక్కన పెట్టేశాయి. ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్‌ నేతల కాళ్ల కింద భూమి కదులుతోంది.

టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కూటములు కడుతున్నారు. కాకమ్మ కథలకు కల్లబొల్లి మాటలకు ఓట్లు పడవు.  జగ్గారెడ్డిపై కేసు 2004 నాటిది. ఆయన మీద కేసు ఉన్నందు వల్లే కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు కాంగ్రెస్‌ ఆ కేసును తొక్కి పెట్టింది. రాజకీయ కక్షే ఉంటే హౌసింగ్‌ కుంభకోణంలో ఉత్తమ్‌ను అరెస్టు చేయించే వాళ్లం. ఉత్తమ్‌ బట్టేబాజ్‌.. అడ్రస్‌ లేనోడు.. మళ్లీ గెలవడు. కేసీఆర్‌ను జైళ్లో పెడతా అంటవా.. ఎన్నికలయ్యాక లోపలుంటావో, బయట ఉంటావో తేల్చుకో’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి రషీద్‌ అనే బ్రోకర్‌తో కేసీఆర్, హరీశ్‌ పేర్లు పెట్టించారని, ఆధారాలుంటే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.  జూబ్లీహిల్స్‌ సొసైటీ కేసులో రేవంత్‌కు నోటీసులిస్తే రాజకీయ కక్ష అంటున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు