నన్ను ఓడించి తప్పు చేశారు.. నామాను గెలిపించండి

29 Mar, 2019 08:27 IST|Sakshi
మాట్లాడుతున్న తుమ్మల. చిత్రంలో ఎంపీ అభ్యర్థి నామా

గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

కూసుమంచి: గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు తప్పుచేశామని భావిస్తున్నారని, వారు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో వచ్చిందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం లో భాగంగా కూసుమంచిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నామా నాగేశ్వరరావు తన మనిషిగా వచ్చారని, ఆయన్ను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని అన్నారు. తాను గతంలో పాలేరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు.

భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో ఈప్రాంతంలోని 360 చెరువులు నింపి పచ్చని పంటలు పండించేలా కృషి చేశానని చెప్పారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకవచ్చినా..తనను ఓడించారని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా..అభివృద్ధి చేసినా తనను ఓడించటం బాధ కలిగించిందని అన్నారు. పాలేరు ప్రజలు ఏవేవో ఆశల పల్లకీలో ఉండి ఈ తప్పుచేశారని చెప్పుకొచ్చారు. అయినా తాను సీఎం సహకారంతో ఈప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధిని పూర్తిచేస్తానని చెప్పారు. ఎంపీగా నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
 
తుమ్మల ఓడితే సీఎం బాధ పడ్డారు: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ..పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే సీఎం కేసీఆర్‌ ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకోవడం ద్వారా ఆ బాధను తీర్చాలన్నారు. 16 మంది ఎంపీలు గెలిస్తే దేశ రాజకీయాల్లో సీఎం కేసీర్‌  ఎదురులేని శక్తిగా ఉంటారని, తద్వారా  రా>ష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధిని సీఎం చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ బిల్లుకు కృషి చేశా: నామా నాగేశ్వరరావు 
టీఆర్‌ఎస్‌ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను తెలంగాణా ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేశానని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి తాను టీఆర్‌ఎస్‌లో కొనసాగాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. తనను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, నాయకులు స్వర్ణకుమారి, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్త్యి రాంచంద్రునాయక్, సీడీసీ చైర్మన్‌ గోపాలరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, కార్యదర్శి ఆసిఫ్‌పాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు