అగ్నిపరీక్షే.. 

30 Mar, 2019 07:02 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్యనేతలకు అగ్నిపరీక్షలా మారింది. పార్టీ ఆదేశాల మేరకు అలుపెరగకుండా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సహా అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం చేస్తుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు నెలల కాలంలో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. అదే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు అధికార పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు. ఇటువంటి పరిణామాలతో ఇరు పార్టీల్లోని ఆయా ముఖ్య నేతలు ప్రచార పర్వాన్ని భుజాన వేసుకుని తమకు అధిష్టానం పెట్టిన పరీక్షలో నెగ్గేందుకు చెమటోడుస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, టీడీపీలకు చెందిన  ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో ఆ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో కొంత బలం పుంజుకుందని భావిస్తున్న అధినాయకత్వం.. అందుకు అనుగుణంగా ఫలితాలు ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు బాధ్యతను ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన నేతలకు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఇటీవల పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల భుజస్కందాలపై పెట్టింది. దీంతో ఇప్పటివరకు పార్టీలో ఉన్న వారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలపై గెలుపు భారం పడడంతో పార్టీ అధినేత దృష్టిలో పనితీరు పడేలా ఆయా నేతలు తమవంతు ప్రయత్నాల్లో ఇప్పటికే నిమగ్నమయ్యారు.
 
రంగంలోకి ‘పొంగులేటి’ 
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచార రంగంలోకి దిగనున్నారు. మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారని పార్టీ శ్రేణులకు సంకేతాలు అందడంతో అభ్యర్థి గెలుపుపై భరోసా వ్యక్తమవుతోంది. అలాగే వచ్చే నెల 4న జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల బహిరంగ సభ విజయవంతం చేయడం సైతం ఈ నేతలకు పరీక్షగానే మారింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామా విజయాన్ని కాంక్షిస్తూ పాలేరుతోపాటు పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు. నామా విజయానికి కృషి చేయాలని కోరుతూనే.. నామా విజయంలో ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ శ్రేణుల పరిస్థితి ఆశాజనకంగా ఉండదని.. అధినాయకత్వం వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదని బహిరంగ సభల్లోనే తుమ్మల హెచ్చరికలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు శాసనసభ స్థానాల్లో పార్టీపరంగా సమన్వయం కోసం కసరత్తు ప్రారంభించింది.

ఖమ్మం నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు నియోజకవర్గ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించగా.. మిగిలిన నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ నేతలకు, రాష్ట్ర పార్టీ బాధ్యులకు అప్పగించారు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌లు పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను, పార్టీ అభ్యర్థిని సమన్వయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అనూహ్యంగా ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విజయం విషయంలో సైతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం జిల్లాలోని ముఖ్య నేతలపైనే భారం వేసింది.

పార్టీలో పరిస్థితులు కొంత చేజారినా.. నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం ఉందని భావిస్తున్న ఆ పార్టీ రేణుక గెలుపు బాధ్యతను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి భుజస్కంధాలపై వేసింది. అయితే ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే ఒకరిద్దరు జిల్లా నేతలు సైతం కొంత అంటీ ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం రేణుక గెలుపును ముఖ్య నేతల భుజస్కంధాలపై వేయడంతో ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూనే.. రేణుకాచౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు