బాబును దేవుడు కూడా క్షమించడు

5 May, 2019 04:46 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌ స్పష్టీకరణ  

ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే కృష్ణా నదిని పూడ్చేస్తున్నారు 

రాష్ట్ర సంపదను చంద్రబాబు.. లోకేశ్‌కు దోచిపెడుతున్నాడు 

విజయవాడ సిటీ: కృష్ణా నదిని యథేచ్ఛగా పూడ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులను దేవుడు కూడా క్షమించడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి నందిగం సురేష్‌ అన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే కృష్ణా నదిని పూడ్చేసి, కబ్జాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని రీతిలో కృష్ణా నదిని పూడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుమారుడు లోకేశ్‌కు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి గుడి భూముల దగ్గర్నుంచి కృష్ణా నది ఇసుక దాకా జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతలు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇక మిగిలిన కృష్ణా నదిని కూడా ఏకంగా కబ్జా చేసి దోచుకోవడం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కృష్ణా నదిని లోకేశ్‌కు అప్పగించే విధంగా జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పనులు చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు చంద్రబాబుకు పర్మిషన్‌ ఇచ్చారా? అని నిలదీశారు. 

బాబుకు మతి భ్రమించింది 
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం పేరుతో దళిత రైతులు, కూలీల ఉపాధిపై తీవ్రంగా దెబ్బకొట్టారని నందిగం సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు  కృష్ణా నదిలో ఇసుకను అమ్ముకోవడానికే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. సమీక్షలు నిర్వహిస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ చంద్రబాబు అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పదవి పోతోందన్న వాస్తవాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఓవైపు ఆకలి చావులు సంభవిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు తన కుమారుడికి రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెందాల్సిన హాయ్‌ల్యాండ్‌ను టీడీపీ నేతలు కాజేశారని మండిపడ్డారు. 

పంచభూతాలను దోచుకున్నారు 
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో కృష్ణా నదిలో 125 ఎకరాల చుట్టూ చుక్కపల్లి ప్రసాద్, కుశలవ సత్యప్రసాద్‌ అనే వ్యక్తులు ఫెన్సింగ్‌ వేస్తే, అధికారులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిందని నందిగం సురేష్‌ గుర్తుచేశారు. అప్పుడు అధికారులు అడ్డుకోవడంతో ఆ కబ్జా ఆగిపోయిందన్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో 70 ఎకరాలను యంత్రాలతో పూడ్చారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దుప్పటి తన్ని పడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు పంచభూతాలను దోచుకుతిన్నారని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని తేల్చిచెప్పారు. రాష్ట్ర సంపదను దోచుకున్నవారిని కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. పోలీçసులే కాదు మిలటరీ వచ్చినా కృష్ణా నదిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు