ఆధార్‌కార్డులేని మీరా విమర్శించేది: లోకేశ్‌

20 Nov, 2017 16:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ఏపీలో ఆధార్‌ కార్డు, ఓటరు కార్డులేని వారే హైదరాబాద్‌లో కూర్చొని నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని లోకేశ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి విమానాల్లో వచ్చిపోయేవాళ్లు.. స్థానికత లేనివాళ్లే నంది అవార్డులను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. మూడు సంవత్సరాలకుగాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటిస్తే.. లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఒకరిద్దరు మాత్రమే ఇలా విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెప్పుకొచ్చారు. అవార్డులు ఇవ్వని వారిని ఏమీ అనరా అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

నంది అవార్డుల్లో అధికార టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై తెలుగు సినీ ప్రముఖులు పలువురు బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు ప్రకటించిన తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల ఎంపికను ప్రశ్నించిన వారిని ఉద్దేశించి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసలు ఆధార్‌ కార్డుకు నంది అవార్డులకు సంబంధం లేదు. ఆధార్‌ కార్డు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది దేశానికి సంబంధించినది. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డుకు నంది అవార్డులకు ముడిపెట్టి.. లోకేశ్‌ విమర్శలు చేయడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. మీడియా సమావేశంలో విలేకరులు సైతం ఇదే ప్రశ్న లేవనెత్తినా లోకేశ్‌ స్పందించలేదు.

మరిన్ని వార్తలు