స్థానికులకు ఉద్యోగాలంటే ఐటీ కంపెనీలే రావు

12 Oct, 2017 08:45 IST|Sakshi

ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టీకరణ

మినీ స్టేడియంల నిర్మాణానికీ ‘ఉపాధి’ నిధులు

సాక్షి, అమరావతి: స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావని పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తేల్చి చెప్పారు. రాష్ట్రానికి అసలే ఐటీ కంపెనీలు సరిగా రావడం లేదని, ఇలాంటపుడు స్థానికులకే ఉద్యోగాలంటే ఆ కంపెనీలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ఉపాధి నిధులను ఇతర ప్రభుత్వ శాఖలలో వినియోగించుకునే అంశంపై చర్చించేందుకు ఆయా శాఖల మంత్రులు, అధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. లోకల్‌ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టడం వల్ల కంపెనీలు చాలా నెగటివ్‌గా తీసుకుంటాయన్నారు. స్థానిక కోటా పెట్టడం వల్ల మనకు ఏవో ఉద్యోగాలు ఇస్తారనే విషయాన్ని తాను నమ్మనన్నారు. ఎకో సిస్టం ఉంటేనే కంపెనీలు వస్తున్నాయని, దానిని అభివృద్ధి చేయడానికి ఇంత సమయం పట్టిందని చెప్పారు. ఇప్పటికే హెచ్‌సీఎల్‌ కంపెనీ వచ్చిందని, మరో నాలుగైదు కంపెనీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. 2019 నాటికి లక్ష ఐటి ఉద్యోగాలు, రెండు లక్షల ఎలక్ట్రానిక్‌ ఉద్యోగాలు తెస్తామని చెప్పారు.

కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు పనులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉపాధి హామీ పథకం నిధులతో స్టేడియంలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.70 కోట్లు ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆర్థిక ఏడాదిలో 70 మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టే మినీ స్టేడియాలకు రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో రూ.కోటి ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఖర్చు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు లోకేశ్‌ అధికారులకు వివరించారు. సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు