లోకేశ్‌కు తెలియకపోవడం విడ్డూరం!

16 Feb, 2019 12:10 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌బాబు తన మనసులోని మాటను బయటపెట్టారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న అపప్రదను తొలగించుకోవడానికి ‘చినబాబు’ ఆపసోపాలు పడుతున్నారు. ప్రతిపక్షాలు పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండటంతో ఆత్మరక్షణలో పడిపోవాల్సివస్తోంది. మంత్రి పదవి విషయంలో తండ్రి ‘వారసత్వాన్ని’ అందిపుచ్చుకున్నారు లోకేశ్‌. నాడు మామ ఎన్టీఆర్‌ అండతో చంద్రబాబు అమాత్య పదవికి దక్కించుకుంటే నేడు తండ్రి మద్దతుతో లోకేశ్‌ మంత్రి కాగలిగారు. మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని అందరికీ తెలిసిందే. (దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!)

పదవుల విషయంలోనే కాదు మాటల విషయంలోనూ తండ్రిని అనుసరిస్తూ అభాసుపాలవడం చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని డ్రామా కంపెనీగా ఆయన వర్ణించారు. అక్కడితో ఆగకుండా ఎంపీల రాజీనామాలు, కోడికత్తి పేరుతో వైఎస్సార్‌సీపీ నాటకాలు ఆడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని కూడా అన్నారు. ఈ మాటలను బట్టే లోకేశ్‌ బండారం బట్టబయలవుతుంది.

ప్రత్యేక హోదా కోసం వైఎస్సా​ర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు టీడీపీ ఎంపీలు రాజీనామా ఎందుకు చేయలేదు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా అంశాన్ని హడావుడిగా భుజానికెత్తుకుని విన్యాసాలు చేస్తున్నదెవరో? బీజేపీతో కేంద్రం, రాష్ట్రంలో నాలుగేళ్లు అధికారం పంచుకుని ప్రత్యేక హోదాను ఎవరు నీరుగార్చారో లోకేశ్‌కు తెలియకపోవడం విడ్డూరం. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి హోదాలో కాకపోయినా కనీసం సాటి మనిషిగా పరామర్శించిన పాపాన పోలేదు తండ్రీకొడుకులు. కోడికత్తి అంటూ ఎగతాళి చేయడమే కాకుండా కేసును నీరుగార్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ అప్పగించకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో జనమంతా చూశారు.  

తమది డ్రామా కంపెనీ అయితే టీడీపీ వెన్నుపోటు కూటమా అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం తాము చేసివని నాటకాలైతే ఇప్పుడు టీడీపీ చేస్తున్నవి ఏంటని సూటిగా ప్రశ్నించారు. విమర్శలు చేసే ముందు వెనుకాముందు ఆలోచించాలని చినబాబుకు హితవు పలికారు. గురివింద చందంగా తమపై విమర్శలు చేస్తే అభాసుపాలు కావ​డం తప్పదని హెచ్చరించారు. దొడ్డి దారిన మంత్రి కావడం కాదు చేతనైతే ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. (చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’)

మరిన్ని వార్తలు