నారా లోకేష్‌కు ఒళ్లుమండింది !

23 Jun, 2018 07:44 IST|Sakshi

అవినీతి, కబ్జాలు, ఎక్కువయ్యాయని మండిపాటు

కుప్పంలో మంత్రి కార్యక్రమాల నుంచి అలిగి వెళ్లిన నేతలు

రెండు రోజుల పర్యటనలో     కానరాని ఉత్సాహం

కుప్పం: పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ కుప్పం పర్యటనలో రెండో రోజు శుక్రవారం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలవారీగా ఏరియా కమిటీ ఇన్‌చార్జిలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుప్పం మండల నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ విషయానికైనా ముఖ్యమంత్రి, తన వద్దకు వస్తే వ్యక్తిగత సమస్యలు చెప్తారే తప్ప, ప్రజాసమస్యలు, పార్టీ స్థితిగతులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం ఇచ్చిన నేతలపై కేకలు వేశారు. ‘ ప్రతి ఒక్కరి విషయాలు నాకు తెలుసు.. అధికారం వచ్చినప్పటి నుంచీ అవినీతి, కబ్జాలు, వసూళ్లు అధికమయ్యాయని మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ గృహ కల్పనలో మంజూరైన ఇళ్లకు డబ్బులు తీసుకుంటారా..? పెన్షన్లకు డబ్బులు తీసుకుంటారా..? ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నది మీరే.. ఇదేమి కుప్పం... పరిస్థితి ఇలా తయారైంది ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

‘రోడ్డు విస్తరణలో రెండో రీచ్‌ పనులు దౌర్జన్యంగా చేస్తారా..? అధికారుల వద్ద చేయించాలే తప్ప మీరే బహిరంగంగా దిగి  ప్రజలను ఇబ్బందిపెడితే ఎలా ? ’ అంటూ నేతలపై కేకలు వేశారు. ‘కోట్లాది రూపాయలు సిమెంటు రోడ్ల కోసం మంజూరు చేస్తే కమీషన్లు తీసుకున్నది నాకు తెలుసు.. అవసరం లేని చోట వందల మీటర్లు బంధువుల ఇళ్లకు, సొంత ప్రయోజనాలకు ప్రజాధనం వృథా చేశారు.. అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి’ అంటూ  పేర్ల ప్రకారం ఆయన మాట్లాడటంతో పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌ అసంతృప్తితో సమావేశం నుంచి వెళ్లిపోయారు.

అనంతరం ఆయన్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు పులిపర్తి నానితో పాటు కొందరు స్థానిక నేతలు బుజ్జగించి సమావేశానికి తీసుకొచ్చారు. మంత్రి తీరుపై మండిపడటంతో కొందరు అసహనం వ్యక్తం చేస్తూ... అనంతరం జరిగిన మంత్రి కార్యక్రమాలకు హాజరుకాలేదు. నారా లోకేష్‌ రెండు రోజుల కుప్పం పర్యటనలో నేతల్లో ఉత్సాహం కానరాలేదు. గురువారం శాంతిపురం మండలం రాళ్లబూదగూరు నుంచి ప్రారంభమైన ఆయన పర్యటనకు జనం స్పందన కరువైంది. శుక్రవారం కుప్పంలో చివరిగా స్పోర్ట్స్‌ స్టేడియం ప్రారంభోత్సవం జనం లేక వెలవెలబోయింది.

మరిన్ని వార్తలు