నిమ్మకూరులో పైసా వసూల్‌

13 Mar, 2018 07:27 IST|Sakshi

నిమ్మకూరును దత్తత తీసుకున్న మంత్రి లోకేష్‌

రూ.28 కోట్ల విలువైన పనులు మంజూరు

కాంట్రాక్టర్ల వద్ద  అనుచరుడి దందా

ఇక్కడ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. చేసే పని చిన్నదైనా అక్కడి నేతకు పైసలు సమర్పించుకోవాల్సిందే. ఇదేమిటంటే చినబాబు పేరు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో కాంట్రాక్టర్లు గుర్రుగా ఉన్నారు. అన్ని పనులకు పర్సంటేజీలు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో దందాకు తెరతీసిన నేత అక్రమ వసూళ్లపై కథనం.

సాక్షి,అమరావతిబ్యూరో: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా వంటబట్టించుకున్నారు అధికార పార్టీనేతలు.. ప్రతి పనిలో పర్శంటేజీలు బహిరంగంగా వసూలు చేస్తున్నారు. తాజాగా పామర్రు నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో  చినబాబు ముఖ్య అనుచరుడు చేస్తున్న దందాలు వివాదస్పదంగా మారాయి. ఆ గ్రామాన్ని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ దత్తత తీసుకొని గ్రామాభివృద్ధి కోసం కేటాయించిన పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీల వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ చెరువులో నీరు..చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

దందాలు ఇలా..
నిమ్మకూరును ఆయన మనవడు  ఐటీ శాఖ మంత్రి నారా లోకేçష్‌ 2015 డిసెంబర్‌లో దత్తత తీసుకున్నాడు. గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే దాదాపు రూ.28 కోట్ల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో ఆయా నిధులతో పనులు జరుగుతున్నాయి.ఆ పనులను టెండర్ల ప్రక్రియలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు వద్ద చినబాబు కీలక అనుచరుడు దందాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌ వద్ద భారీగానే వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆస్పత్రి శంకుస్థాపన సమయంలోనే  వసూళ్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో స్వయంగా అప్పటి మంత్రి కామినేని శ్రీనివాస్‌ పర్సంటేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే రూ.3 కోట్ల వ్యయంతో ఉండరపూడి నుంచి  నిమ్మకూరు మీదగా వెళ్లే రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్‌ వద్ద కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.. ఇలా ప్రతి పనిలో చినబాబు పేరుతో చేస్తున్న దందాల వ్యవహారంపై సదరు కాంట్రాక్టర్లు లబోదిబోమంటూ ఆ పార్టీ నేతలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గత రెండేళ్ల కాలంలో దందాల పేరుతో సదరు చోటానేత భారిగానే ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

నీరు–చెట్టు పేరుతో మట్టి అమ్మకాలు
నిమ్మకూరు చెరువులో పూడిక తీత కోసం నీరు–చెట్టు పథకం ద్వారా ప్రభుత్వం రూ.8.5 లక్షలు మంజూరు చేసింది. ఆయా పనులను చేజిక్కించుకున్న చిన బాబు అనుచరుడు  పూడిక తీత పేరుతో మట్టి విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజంగా చెరువులో తీసిన మట్టిని రైతులకు, లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉచితంగా తోలాలి..కానీ సదరునేత భారీ యంత్రాలతో చెరువును తోడేస్తూ  ఆ మట్టిని వ్యాపార కలాపాలకు, ఇతరత్రా అవసరాలను విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారినట్లు సమాచారం.    చెరువు పూడిక తీతలో కూడా కేవలం 3 మీటర్లు మాత్రమే మట్టిని తీయాల్సి ఉన్నా 15 నుంచి 20 అడుగుల మేర నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే మట్టి విక్రయాలతో లక్షలాది రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలున్నాయి. చినబాబు పేరు చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించి మట్టి విక్రయాలు చేస్తున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.

ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో
చినబాబు ప్రధాన అనుచరుడు చేస్తున్న దందాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.28 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే పనులు సాగుతున్నాయి. టెం డర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను చినబాబు అనుచరుడు బెదిరించి పర్సంటేజీలు వసూలుచేస్తున్నారనే ఆరోపణలువెల్లువెత్తాయి.

నిమ్మకూరు చెరువుతో యంత్రంతో మట్టి తవ్వకాలు

మరిన్ని వార్తలు