లోకేశ్‌ హైడ్రామా

12 Apr, 2019 03:44 IST|Sakshi

100 మంది అనుచరులతో బల ప్రదర్శన

పోలింగ్‌ అధికారులకు వ్యతిరేకంగా ధర్నా

దాడికి యత్నించిన లోకేశ్‌ అనుచరులు

చోద్యం చూసిన పోలీసులు

లోకేశ్‌ వెళ్లిపోయాక వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి

‘సాక్షి’ విలేకరి ఫోన్‌ లాగేసుకున్న ఎస్పీ విజయరావు

సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో గురువారం సాయంత్రం హైడ్రామాకు తెరతీశారు. తాడేపల్లిలోని క్రిస్టియన్‌ పేటలోని 34, 37 పోలింగ్‌ బూత్‌ల పరిశీలనకు 5 గంటల సమయంలో వచ్చిన లోకేశ్‌.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా 100 మంది అనుచరులతో బల ప్రదర్శనకు దిగారు. అధికారులను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడే మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల కమిషన్‌పై దుమ్మెత్తిపోశారు. ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధ్వానంగా చూశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం వచ్చి ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  
 
లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

మంత్రి లోకేశ్‌ వందమంది అనుచరులతో పోలింగ్‌ బూత్‌కు వచ్చినా.. నిబంధనలను బే«ఖాతరు చేస్తూ మీడియా సమావేశం నిర్వహించినా.. ధర్నాకు దిగినా పోలీసులు చోద్యం చూస్తూ స్వామి భక్తి ప్రదర్శించారు. లోకేశ్‌ అక్కడి నుంచి వెళ్లగానే.. పోలీసులు వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలు సైతం దాడికి దిగారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు విలేకరి ప్రయత్నించగా.. అతనిపైనా లాఠీలు ఝళిపించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎస్పీ సీహెచ్‌ విజయరావు విలేకరి సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాగేసుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు ఎలా వత్తాసు పలుకుతున్నారనే దానికి ఎస్పీ తీరు నిదర్శనంగా నిలుస్తోంది. 

‘సాక్షి’ విలేకరిపై దౌర్జన్యం
ఇరుకుగా ఉండే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బంది కలిగించేలా మీడియా సమావేశం పెట్టడం ఏమిటని ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరి నాగిరెడ్డిపై లోకేశ్‌ దౌర్జన్యానికి దిగారు. ‘ఏయ్‌.. ఏ పేపరు నీది. సాక్షి రిపోర్టర్‌ కదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆయన అనుచరులు విలేకరిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు విలేకరికి మద్దతుగా నిలవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి లోకేశ్‌ విలేకరిపై తిట్ల దండకం అందుకున్నారు. తర్వాత వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తనపై దౌర్జన్యానికి దిగారంటూ పోలింగ్‌ బూత్‌ వెలుపల ధర్నా చేశారు. ఆయనకు పోటీగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సైతం అక్కడే నిరసనకు దిగారు. దీంతో లోకేశ్‌ అక్కడి నుంచి తరలివెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు