చంద్రబాబు నివాసంలో ‘విందు’ భేటీ

2 Mar, 2020 12:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. (చదవండి: మరోసారి కూన రవికుమార్‌ రౌడీయిజం..)

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీపై తన పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనతో పాటు రాజకీయంగానూ తనపై పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో నారా లోకేష్‌ ఈ విందు రాజకీయం మొదలుపెట్టినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్‌ చెప్పినట్లు తెలిసింది. (విజయవాడ నడిబొడ్డున కోట్ల విలువైన భూమి కబ్జా)

మరిన్ని వార్తలు