పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేశ్‌

24 May, 2018 09:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందసాలో సుమారు 16 కోట్ల నిధులతో ఏడు ఎన్టీఆర్‌ సుజల మదర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాం. వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోంది. 136 రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లలలో డయాలసిస్‌ పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2500 పెన్షన్‌ అందిస్తున్నాం. నాలుగు నెలల్లో 15 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసి, ఇప్పటివరకూ లక్షమందికి పైగా స్ర్కీనింగ్‌ జరిగింది. సోంపేటలో నూతన ల్యాబ్‌ ఏర్పాటు చేసాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా పలాస, సోంపేట, పాలకొండలో మూడు రినల్‌ డయాలసిస్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ గ్లోబల్‌ హెల్త్‌ ఆస్ట్రేలియా ఆధ్వర‍్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలపై పరిశోధన, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభమైంది. ఒక నిర్ణయానికి వచ్చేముందు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు బేరీజు వేసుకోవాలి.’ అని సూచించారు.

కాగా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సరైన విధివిధానాలు 48 గంటల్లో ప్రకటించాలని.. లేని పక్షంలో నిరసన దీక్షకు కూర్చుంటానని ఏపీ ప్రభుత్వానికి పవన్‌ అల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా