బాలయ్య తాతా.. అఫిడవిట్‌లో హెరిటేజ్‌ షేర్లేవీ?

22 Feb, 2020 03:26 IST|Sakshi
మనవడు దేవాన్ష్‌తో బాలకృష్ణ (ఫైల్‌)

2019లో బాలకృష్ణ ఎన్నికల అఫిడవిట్‌లో కనిపించని హెరిటేజ్‌ షేర్లు

అందులో చూపించింది 5 కంపెనీలకు చెందిన రూ.31.28 కోట్ల విలువైన షేర్లే 

2018–19లో మనవడి పేరున 26,440 షేర్లు బదిలీ అయితే స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు చెప్పరా?

పత్రికా సమావేశంలో బాలయ్య పేరు ఎక్కడా పేర్కొనని లోకేశ్‌

బాలయ్య బహుమతిగా పచ్చ పత్రికల్లో రాయించుకున్న వైనం

సాక్షి, అమరావతి: ఆస్తుల ప్రకటన డ్రామాతో జనాల చెవుల్లో హెరిటేజ్‌ క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు అండ్‌ కో. అసలు ఎవరైనాసరే తమ దగ్గర లేని షేర్లను ఇంకొకరికి గిఫ్ట్‌గా రాసిచ్చేయడం సాధ్యమేనా? 2018–19 ఏడాదికి గాను తాజాగా ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్ష్కు తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన లేదు. అయితే ఇక్కడ ప్రకటిస్తున్నది  తమ కుటుంబ ఆస్తులు కాబట్టి తాతంటే చంద్రబాబే అని పేర్కొంటూ గురువారం రాత్రి ప్రధాన వెబ్‌సైట్లన్నీ రాశాయి. కొద్దిసేపటికి అసలు చంద్రబాబు పేరుతో షేర్లే లేనప్పుడు ఆయన మనవడికి గిఫ్ట్‌ ఎలా ఇస్తారని కొందరు లోకేశ్‌తో ధర్మసందేహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తమ కోటరీ పత్రికలను ఈ తప్పు సరిదిద్దమంటూ పురమాయించారు. తెల్లారేసరికి తమ అనుకూల పత్రికలన్నింటిలో తాత బాలకృష్ణ ఈ షేర్లను దేవాన్ష్కు బహుమానంగా ఇచ్చారంటూ రాయించారు. 
 
తప్పు మీద తప్పు.. 

తాత పేరు విషయంలో తడబడ్డ చంద్రబాబు అండ్‌ కో.. దీన్ని సరిదిద్దుకునే క్రమంలో మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అసలు 2019 మార్చి 22న ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో బాలకృష్ణ తన పేరుమీద హెరిటేజ్‌ షేర్లు ఉన్న విషయాన్నే పేర్కొనలేదు. అది మరిచిపోయి, తాతంటే చంద్రబాబు కాదు.. బాలయ్య అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. 2019 అఫిడవిట్‌లో బాలకృష్ణ తనకు రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో రూ.12 కోట్ల విలువైన 12 శాతం వాటా, సికింద్రాబాద్‌లోని ఒక సంస్థలో రూ.7 లక్షల విలువైన ఏడోవంతు వాటా, క్లాసిక్‌ ఇన్ఫోటెక్‌లో 25 శాతం వాటా (విలువ 19.21 కోట్లు), 27 రిలయన్స్‌ పెట్రోలియం షేర్లు (విలువ రూ.7,310), ఎన్‌బీకే ఫిల్మ్‌లో రూ.50,000 విలువైన వాటాలు ఉన్నట్లు మాత్రమే పేర్కొన్నారు. తన వద్ద మొత్తం 5 కంపెనీలకు సంబంధించి మొత్తం రూ.31.28 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాత్రమే తెలిపారు. ఎక్కడా హెరిటేజ్‌ ఫుడ్‌ షేర్లు ఉన్నట్లు ప్రకటించలేదు. మరి తన దగ్గర లేని షేర్లను బాలకృష్ణ ఇప్పుడు మనవడు దేవాన్ష్కు ఎలా ఇచ్చాడో లోకేశ్‌ చెప్పాలి. 

 స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు తెలుపలేదెందుకు? 
దేవాన్ష్ పేరిట 2017–18లో హెరిటేజ్‌ షేర్లు లేవు. అంటే 2018–19లోనే హెరిటేజ్‌ షేర్లు దేవాన్ష్ పేరిట బదిలీ అయ్యి ఉండాలి. దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరి కంపెనీ ఎండీ, తల్లి బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.. ఇలా ప్రమోటర్లకు రక్త సంబంధీకుడైన దేవాన్ష్ పేరిట ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన 26,440 షేర్లు బదలాయింపు జరిగితే అది తప్పకుండా స్టాక్‌ ఎక్స్చేంజ్‌కి తెలియజేయాల్సిందేనని కంపెనీ సెక్రటరీలు స్పష్టం చేస్తున్నారు. 2018–19 ఆర్థిక ఏడాదికి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ని పరిశీలిస్తే మనవడి పేరిట షేర్లు వచ్చినట్లు భువనేశ్వరి కానీ, కొడుకు పేరిట షేర్లు వచ్చినట్లు లోకేశ్‌ కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఇది కచ్చితంగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఇలా ఒక వ్యక్తి పేరు మీద ఉన్న షేర్లు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ప్రమేయం లేకుండా మరో వ్యక్తికి ఎలా బదలాయిస్తారో, ఆ మాయ ఏంటో స్టాక్‌ మార్కెట్లో తలపండిన వాళ్లకు కూడా మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో గ్యాంగ్‌ ఇంకో కొత్త డ్రామాకు తెరతీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

మరిన్ని వార్తలు