ఎన్టీఆర్‌ను సీఎం చేసిన ఘనత ఇందిరాగాంధీదే

10 Jul, 2018 02:18 IST|Sakshi

     మళ్లీ తడబడిన మంత్రి లోకేశ్‌

     చర్చనీయాంశమైన మంత్రి వ్యాఖ్యలు

     ఉద్యోగులు, బీసీ నేతలపై ఆగ్రహం

సాక్షి, కర్నూలు: ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన బ్రాహ్మణకొట్కూరులో ఈ వ్యాఖ్యలు చేశారు. తడబడుతూ చేసిన ప్రసంగంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆనాడు ఫుల్‌ మెజార్టీ ఉన్నా అన్నగారిని దింపితే తెలుగు ప్రజలు గర్జించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. వర్ధంతిని జయంతి అనడం, జయంతిని వర్ధంతి అనడం, అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉందనడం, సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే మనల్ని మనమే ఉరి వేసుకున్నట్లు అనడం ఇంతకుముందు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 

కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించిన మంత్రి 
వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకను, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి లోకేశ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పాతబస్తీలోని ఉస్మానియా కళాశాల మైదానంలో మైనార్టీ పొదుపు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల మేర లోటు ఉండేదని, ఆ లోటును సీఎం చంద్రబాబు పూడ్చడమే కాకుండా లోటు రహిత బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. మంచి పాలన చూసి ఓర్వలేక ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని విమర్శించారు.

గొంతెమ్మ కోరికలు కోరొద్దు!
వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన పలువురిపై మంత్రి లోకేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరిన ఉద్యోగులపై ఆగ్రహించారు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరవద్దన్నారు. ఇది రాష్ట్ర పరిధిలో లేని విషయం అని మీకు తెలియదా అంటూ మండిపడ్డారు.  

కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత 
మెడికల్‌ సీట్ల భర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వెంటనే మొదటి విడత కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు మంత్రి లోకేశ్‌ కాన్వాయ్‌ను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం వద్ద అడ్డుకున్నారు. ఐదుగురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విద్యార్థి నేతలతో మంత్రి మాట్లాడుతూ.. మెడికల్‌ సీట్ల భర్తీ విషయం తన శాఖ పరిధిలోకి రాదంటూ తప్పించుకున్నారు.

మరిన్ని వార్తలు