గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

10 Aug, 2019 15:55 IST|Sakshi

భారత మీడియాకు బేర్‌ గ్రిల్స్‌ ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ప్రముఖ షో ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో షో హోస్ట్‌ బేర్‌ గ్రిల్స్‌ భారత మీడియాతో ముచ్చటించారు. ‘దేశంలోనే ముఖ్యమైన వ్యక్తి అయిన మోదీ’తో తాను గడిపిన అనుభవాలను పంచుకున్నారు. గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ఇదే తరహాలో బేర్‌ గ్రిల్స్‌ షో నిర్వహించారు. పలు విషయాల్లో మోదీకి, ఒబామాకు పోలికలు ఉన్నాయని ఆయన ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలో మోదీ ఎంతో నిబద్ధత కలిగి ఉన్నారని, గతంలో ఒబామాతో కలిసి అలస్కా అడవుల్లో షో నిర్వహించిన సందర్భంగా ఆయన కూడా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, మనం పర్యావరణాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత ఉందని ఇద్దరు నేతలూ అభిప్రాయపడ్డారని గ్రిల్స్‌ తెలిపారు. మనందరిని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలతో ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేందుకు ప్రపంచ నేతలు ఇలా ప్రయత్నించడం తనకో భిన్నమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.

భారత సంస్కృతీ, సంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్న గ్రిల్స్‌.. మోదీని ఐకానిక్‌ గ్లోబల్‌ లీడర్‌ అంటూ ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముఖంపై చెక్కుచెదరని దరహాసంతో ఎంతో హుందా, వినమ్రంగా మోదీ వ్యవహరించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ‘పర్యావరణం అంటే మోదీకి ఎంతో శ్రద్ధ ఉంది. అందుకే ఆయన నాతో కలిసి ప్రయాణించారు. నిజానికి మోదీ యవ్వనంలో ఉన్నప్పుడే అడవుల్లో గడిపారు. అడవుల్లోనూ ఆయన అలవోకగా గడపడం, ఎంతో శాంతంగా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని గ్రిల్స్‌ తెలిపారు. గతంలో ఎన్నడు చూడనిరీతిలో మోదీని ఈ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారని, ప్రపంచంలోనే టీవీలో అత్యధికంగా వీక్షించిన షోగా ఇది నిలుస్తుందనే నమ్మకముందని గ్రిల్స్‌ పేర్కొన్నారు.
 

చదవండి: ఏ ప్రాణినీ చంపలేను: మోదీ

మరిన్ని వార్తలు