మాజీ ప్రధానులకు, సోనియాకు మోదీ ఫోన్‌

5 Apr, 2020 16:38 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాల ప్రముఖులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, హెచ్‌డీ దేవేగౌడలకు మోదీ ఫోన్‌ చేసినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా కరోనా కట్టడికి సంబంధించిన అంశాలను మోదీ వారితో చర్చించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. అలాగే కరోనా నియంత్రణ కోసం వారి వద్ద నుంచి సూచనలు, సలహాలను కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశంలోని పలు పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులకు కూడా మోదీ ఫోన్‌ చేసినట్టుగా సమాచారం.

కరోనా కట్టడిలో భాగంగా మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేటప్పుడు ఆయన ప్రతిపక్షాల నుంచి గానీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి గానీ ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండా.. ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్‌యాద్‌, అఖిలేశ్‌ యాదవ్‌, తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌లకు మోదీ ఫోన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలపై వారితో మోదీ చర్చించినట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ముఖ్యంగా లాక్‌డౌన్‌ గడువు ఏప్రిల్‌ 14తో ముగుస్తుండటంతో.. ఆ తర్వాత ఏం చేద్దామనే దానిపై మోదీ అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లోని అన్ని పార్టీల సభాపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఇండియాలో 472 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,374కి చేరింది. 77 మంది కరోనా వైరస్‌ సోకి మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు