రెండోసారి ఎన్డీయే నేతగా మోదీ

25 May, 2019 19:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోదీని బీజేపీ ఎంపీలు ఎన్నుకున్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమైన ఎన్డీఏ ఎంపీలు మోదీని రెండోసారి ఎన్డీయే నేతగా ఎన్నికున్నారు. పార్లమెంటరీ పక్షనేతగా మోదీ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రతిపాదించగా.. రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ బలపరిచారు. ఎన్డీయే నేతగా మోదీ పేరును అకాళీదళ్‌ చీఫ్‌ ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ప్రతిపాదించగా.. నితీష్‌ కుమార్‌, ఉద్దవ్‌ ఠాక్రే, రాంవిలాస్‌ పాశ్వాన్‌ బలపరిచారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన ఎన్డీఏ మిత్రులకు, తొలిపారి ఎంపీలుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఈసీ విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ ఐదేళ్లలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామని అందుకే ప్రజలు ఈ మహత్తర విజయం ఇచ్చి గురుతర బాధ్యత అప్పజెప్పారన్నారు.

‘ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత్ ప్రజాస్వామ్యం పరిణతి దిశగా పయనిస్తోంది. ఎంత ఉన్నతస్థితికి చేరినా సేవాభావం మరిచిపోం. సేవాభావం ఉన్నంత వరకు ప్రజాదరణ మనకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఎన్డీఏ విజయాన్ని కాంక్షించారు. మా చిత్తశుద్ధి, సుపరిపాలన చూసే ప్రజలు ఓటేశారు. నేను కూడా మీలో ఒకడినే అని భావించండి. ప్రజలు మనపై మరోసారి భరోసా ఉంచారు. వారి ఆశలకు అనుగుణంగా పని చేద్దాం’ అని మోదీ ఎన్డీయే ఎంపీలకు సూచించారు.
 

మరిన్ని వార్తలు