లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ

13 Jun, 2019 03:27 IST|Sakshi

ఉపనేతగా రాజ్‌నాథ్‌సింగ్‌

పార్లమెంటరీ పార్టీ భేటీ  

న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ నేతగా ప్రధాని మోదీ, ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ నియమితులయ్యారు. బుధవారం ఇక్కడ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఎన్నుకుంది. రాజ్యసభలో అధికార పార్టీ నేతగా బీజేపీకి చెందిన దళిత నేత, కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్, ఉపనేతగా పీయూష్‌ గోయెల్‌ నియమితులయ్యారు. చీఫ్‌ విప్‌గా సంజయ్‌ జైస్వాల్‌తోపాటు ప్రథమంగా ముగ్గురు మహిళా ఎంపీలను, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 15 మంది లోక్‌సభ సభ్యులను విప్‌లుగా నియమించింది. రాజ్యసభ నుంచి కూడా ఆరుగురిని విప్‌లుగా ప్రకటించింది.

సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ సభ్యులు గడ్కరీ, రవి శంకర్, అర్జున్‌ ముండా, నరేంద్ర తోమర్, జువల్‌ ఓరమ్, స్మృతీ ఇరానీ హాజరయ్యారు.  అలాగే, రాజ్యసభ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా జేపీ నడ్డా, ఓ ప్రకాశ్‌ మాథుర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్‌ జవడేకర్‌ పాల్గొన్నారు. ఎంపీలు కానందున మొదటిసారిగా ఈ కమిటీలో సభ్యులు కాని అగ్ర నేతలు, ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి సమావేశానికి రాలేదు. బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం ఇన్‌చార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ, కార్యదర్శిగా తెలుగు వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.  16న పార్టీ బీజేపీ మొదటి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం కానుంది. మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది

పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి అయిన కామర్సు బాలసుబ్రహ్మణ్యంను మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాలసుబ్రహ్మణ్యంను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను కార్యదర్శిగా కొనసాగించింది. 2007 నుంచి 2010 వరకు బీజేపీ జాతీయ మీడియా సహ కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వహించారు. నితిన్‌ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్‌ సెల్‌ జాతీయ సహ కార్యదర్శిగా కూడా పని చేశారు. 

>
మరిన్ని వార్తలు