అజ్ఞాతం నుంచి అత్యున్నత పీఠం దాకా

31 May, 2019 04:11 IST|Sakshi

దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌దాస్‌ మోదీ, హీరాబెన్‌ మోదీ దంపతులకు 1950, సెప్టెంబర్‌ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో నరేంద్ర మోదీ జన్మించారు. బాల్యంలో తండ్రితో కలిసి టీ అమ్మిన మోదీ, ఆ తర్వాత సోదరుడితో కలిసి సొంతంగా టీ షాపును పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) పట్ల మోదీ ఆకర్షితులయ్యారు. 1968లో ఇంట్లోవాళ్లు మోదీకి జశోదాబెన్‌తో వివాహం జరిపించగా, ఇది ఇష్టంలేని మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి 1971లో గుజరాత్‌కు చేరుకున్న మోదీ, ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్‌ కార్యకలాపాలను కొనసాగించారు.

సీనియర్ల గుస్సా..
మోదీ క్రమశిక్షణను, వాక్చాతుర్యాన్ని గుర్తించిన ఆరెస్సెస్‌ నేతలు 1985లో గుజరాత్‌ బీజేపీ విభాగం నిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో విస్తృతంగా పర్యటించిన మోదీ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేశారు. అడ్వాణీ ప్రారంభించిన ‘రథయాత్ర’, బీజేపీ నేత మురళీమనోహర్‌ జోషీ ప్రారంభించిన ‘ఏక్తాయాత్ర’ బాధ్యతలను మోదీ దగ్గరుండి చూసుకున్నారు. పార్టీలో మోదీ ఎదుగుదలపై ఆందోళన చెందిన సీనియర్లు కేశూభాయ్‌పటేల్, శంకర్‌సింఘ్‌వాఘేలా, కాన్షీరామ్‌ రాణా, మోదీ గుజరాత్‌లో ఉండేందుకు వీల్లేదని తీర్మానించారు. దీంతో బీజేపీ అధిష్టానం మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించగా, దేశంలోని పార్టీ శ్రేణులతో ఆయన సత్సంబంధాలు పెంచుకున్నారు.

సీఎంగా బాధ్యతలు.. సవాళ్లు
గుజరాత్‌ సీఎం కేశూభాయ్‌పటేల్‌ ఆరోగ్యం క్షీణించడం, అవినీతి ఆరోపణలతో కేశూభాయ్‌ను తప్పించి మోదీని బీజేపీ గుజరాత్‌ సీఎంను చేసింది. 2001, అక్టోబర్‌7న మోదీ గుజరాత్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్‌కోట్‌–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అశ్విన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుదహనం అనంతరం చెలరేగిన మతఘర్షణలను అణచివేయడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఘర్షణల అనంతరం మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, 182 సీట్లకు గానూ 127 చోట్ల విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మోదీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. 2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

మరిన్ని వార్తలు