వచ్చే నెల 3, 5 తేదీల్లో మోదీ బహిరంగ సభలు

18 Nov, 2018 01:08 IST|Sakshi
శనివారం కండువా కప్పి అరుణతారను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న లక్ష్మణ్‌. చిత్రంలో పార్టీ నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా షెడ్యూలు ఖరారు అయిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. వారితోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 25, 27, 28 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ సభల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం పార్టీ కార్యాలయంలో జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే అరుణ తార లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో సూర్యాపేటకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కట్కూరి గన్నారెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి ప్రజలందరికీ తెలుసన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని సంపాదించిన అవినీతి సొమ్ముతో గెలవాలని రెండు పార్టీలు చూస్తున్నాయన్నారు. బలహీనవర్గాలు, దళిత సంక్షేమంకోసం నరేంద్ర మోదీ పంచసూత్రాల పేరుతో కృషి చేస్తున్నారన్నారు. మోదీ దళితులకోసం చేస్తున్న కృషిని చూసి అరుణతారలాంటి వారు బీజేపీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రాజెక్టులు కట్టకుండా అవినీతికి పాల్పడితే, టీఆర్‌ఎస్‌ రీడిజైన్ల పేరుతో దండుకుందన్నారు. ఆ రెండు పార్టీలు సన్యాసం తీసుకునేలా తీర్పు ఇచ్చే రోజు దగ్గర పడిందన్నారు. అనం తరం అరుణతార మాట్లాడుతూ, తాను అనేక సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని తెలిపారు. దళితులకు న్యాయం చేస్తామని అబద్దాలు చెప్పిన పార్టీలకు బుద్ధిచెప్పే రోజు వచ్చిందన్నారు.  అనంతరం పార్టీ ప్రచార పాటల సీడీని లక్ష్మణ్‌ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు