నరేంద్రజాలం

18 Apr, 2019 05:11 IST|Sakshi

మోదీ.. ఎందుకంత క్రేజీ

సోషల్‌ మీడియాతో మాయాజాలం

కైలీ జెన్నర్, ట్రంప్‌ను తలదన్నే పబ్లిసిటీ

యంగ్‌ ఇండియన్స్‌తో కెమిస్ట్రీ

ఏమిటా ‘ఇమేజ్‌’ విజయ రహస్యం?

నాది 56 అంగుళాల ఛాతీ. నాకున్న దమ్ముతో దేశాన్ని నిలబెడతా అంటూ ప్రచారం చేసుకోవడమా?.. చాయ్‌వాలా కూడా ప్రధాని కాగల దేశం మనదేనంటూ విదేశీ వేదికలపై కూడా భారత్‌ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమా?.. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్‌ వంశ పారంపర్య పాలనపై నిప్పులు చెరగడమా?.. ప్రజాస్వామిక స్వేచ్ఛ గురించి పదేపదే తన ప్రసంగాల్లో చెప్పడమా?.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక యూత్‌ ఐకాన్‌గా ఎలా ఉన్నారు? గత ఐదేళ్లలో ప్రధానిగా ఎన్నో రంగాల్లో విఫలమైనా ఆయన ఇమేజ్‌ చెక్కు చెదరకుండా ఎలా ఉంది?.. ఒక డొనాల్డ్‌ ట్రంప్, ఒక కైలీ జెన్నర్‌లా యూత్‌లో మోదీకి ఫాలోయింగ్‌ ఎలా పెరిగిపోతోంది? మోదీ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తే..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు. కానీ ఆ వైఫల్యాలను ప్రజలు మరచిపోయేలా ఆయన ఒక మాయాజాలాన్నే సృష్టించారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగం రేటు తారాజువ్వలా దూసుకుపోతూ రికార్డు సృష్టించింది. ఉగ్రవాదాన్ని అరికడతానని, బ్లాక్‌ మనీని బయటకు తీస్తానని పెద్ద నోట్లు రద్దు చేశారు. జనం పడరాని పాట్లు పడ్డారు. గ్రామీణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకల పీచమణచారు. కానీ బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందన్నట్టుగా కశ్మీర్‌లో మిలిటెన్సీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రమూకలు పంజా విసిరాయి.. కశ్మీర్‌ లోయలో బీభత్సం సృష్టించారు. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ అదరలేదు. బెదరలేదు.

పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆయన స్వరంలో ధ్వనించే ఆగ్రహావేశాలు, భారత్‌ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడినప్పడు మోదీ మాటల్లో తొణకిసలాడే ఆత్మవిశ్వాసం, సోషల్‌ మీడియాలో తన గురించి తాను చేసుకునే ప్రచారం ఇవన్నీ ఆయన వైఫల్యాలను పక్కనే పెట్టేలా చేశాయనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో యువతరం గుజరాత్‌ అభివృద్ధి నమూనాయే ఆదర్శంగా నమో మంత్రాన్ని జపించారు. ఈసారి కూడా ఆయనకున్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఆయన సృష్టించిన మాయాజాలంలో పడి యువత కొట్టుకుపోతోంది. వాస్తవ ప్రపంచంలో ఆయన ఏం చేశారన్నది కాదు, సోషల్‌ మీడియాలో ఓ వర్చువల్‌ రియాల్టీని మోదీ సృష్టించి యువతరం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. దటీజ్‌ మోదీ!.

ట్రంప్, కైలీ, మోదీ.. అందరిదీ ఒకే బాట
యువభారతం మోదీ వెంట ఉన్నదంటే ఇదేదో ఎన్నికలో, రాజకీయాలో అని భావించనక్కర్లేదు. వీటన్నింటికి మించి ఆయన యువతరంతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారని అంటారే, అచ్చంగా అలాగే భారత్‌ బంగారు భవిష్యత్‌ గురించి తాను కంటున్న కలలు ఈస్ట్‌మన్‌ కలర్‌లో అందరికీ చూపించడమే ఆయన నేర్పరితనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఎన్ని విమర్శలున్నాయో, ఆయనను సెభాష్‌ అని మెచ్చుకునే వారూ అంతేమంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో ట్రంప్‌ ట్వీట్లు ఎంత వివాదాస్పదం అవుతాయో, అంతే వైరల్‌ అవుతాయి కూడా. అమెరికా మీడియా పర్సనాలిటీ, మోడల్‌ కైలీ జెన్నర్‌ వయసు 20 ఏళ్లయినప్పటికీ ఆమెకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేస్తే అదే ఫ్యాషన్‌. యువతరం గుడ్డిగా అదే ఫాలో అవుతుంది. జనంలో ఉన్న ఆ క్రేజ్‌నే పెట్టుబడిగా పెట్టి ఆమె మొదలు పెట్టిన కైలీ కాస్మోటిక్స్‌తో  ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా సంపాదిస్తున్నారంటే ఎవరైనా అవాక్కవాల్సిందే. మోదీది కూడా వారి బాటే.

ఆకర్షించే ట్వీట్లు.. యూ ట్యూబ్‌లో పంచ్‌లు..
గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని ఒక అంచనా. అప్పటికీ ఇప్పటికీ దాని విస్తృతి బాగా పెరిగిపోయింది. రిలయన్స్‌ జియో వంటి సంస్థలు వచ్చాక ఇంటర్నెట్‌ డేటా ప్లాన్స్‌ బాగా చౌకగా వస్తున్నాయి. దీంతో నిరుపేదలు కూడా భారత్‌లో స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్‌ యాప్‌లకి ఆదరణ పెరిగింది. కానీ వాట్సాప్‌ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో వచ్చే సమాచారానికి విశ్వసనీయతపై ఎన్ని సందేహాలున్నా జనం వాటినే నమ్ముతూ ఆ లోకంలోనే బతికేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా దానిని తనకు కావల్సినట్టు వినియోగించుకోవడంలో ఆరితేరిపోయారు. నెటిజన్లను ఆకర్షించేలా ట్వీట్లు పెట్టడం, తన ఉపన్యాసాల్లో పంచ్‌ డైలాగ్‌లను యూ ట్యూబ్‌లో పెట్టడం, తన డ్రెస్సింగ్‌ ఫ్యాషనబుల్‌గా ఉండటం.. ఇలా ఏది చూసినా యువతరాన్ని ఆకర్షించేలా జాగ్రత్తలే తీసుకున్నారు.

ఇందిరమ్మదీ ఇదే స్టైల్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీటికిమాటికి ఇందిరాగాంధీని, కాంగ్రెస్‌  వంశానుగత రాజకీయాలను దూషిస్తూ ఉంటారు కానీ ఇద్దరిదీ ఒకటే స్వభావం. అంతా నేనే అన్నట్టుగా అందరినీ తన చుట్టూ తిప్పుకోవడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. అప్పట్లో సోషల్‌ మీడియా లేకపోయినప్పటికీ ఇందిరాగాంధీ తనకున్న అధికార దర్పంతో అందరినీ తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారు. ఇందిర కంటే మోదీ రెండాకులు ఎక్కువే చదివారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ తరహా రాజకీయ నాయకుల్ని ప్రజాస్వామిక నియంతలని పిలుస్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వాన్నే నేటి తరం ఇష్టపడుతోంది. మోదీ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, స్వయంకృషితో పైకి ఎదిగిన తీరు, తన వ్యక్తిత్వాన్ని తానే ప్రచారం చేసుకునే నైజం.. ఇవన్నీ యువతరాన్ని ఆకర్షించే అంశాలేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందిరాగాంధీకి మోదీ కొడుకుగా పుట్టాల్సిన వారని గతంలోనే ఆయనపై కామెంట్లు కూడా వినిపించాయి.

డిజిటల్‌ సైకో పాలిటిక్స్‌లో మాస్టర్‌
సెంటిమెంట్‌ను రగిలించడం మోదీకి తెలిసినంతగా మరో రాజకీయ నాయకుడికి తెలీదేమో. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో యువతలో దేశభక్తిని రగిలించి డిజిటల్‌ మీడియాలో బాగా ప్రచారం చేయడం ద్వారా దానినే ఎన్నికల అస్త్రంగా మార్చేశారు మోదీ. సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై బాలీవుడ్‌ స్టైల్‌లో ఒక మ్యూజిక్‌ వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రాజకీయ శాస్త్రాన్ని, చరిత్రని, సోషియాలజీని ఔపోసన పట్టి సెఫాలజీపై పట్టు సాధించడమే కాదు.. ఈ డిజిటల్‌ యుగంలో మానవ సమాజాన్ని, వారి సాంస్కృతిక భావజాలాన్ని, మనస్తత్వాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆంత్రోపాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోదీ పేరే మొదట చెప్పుకోవచ్చు. సోషల్‌ మీడియాలో ప్రజాస్వామిక నియంతలుగా భావిస్తున్న వారి కంటే తన గురించి తాను ప్రచారం చేసుకోవడంలో, స్వీయ గౌరవాన్ని పెంచుకోవడంలో మోదీ ఒక అడుగు ముందే ఉంటారని రచయిత, రాజకీయ విశ్లేషకుడు పంకజ్‌ మిశ్రా అభిప్రాయంగా ఉంది.

మరిన్ని వార్తలు