పుల్వామా దాడి తర్వాత: మోదీ 46.. రాహుల్‌ 23..!

13 Mar, 2019 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర ఆత్మాహుతి దాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి జాతీయవాదం గురించి పదే పదే వినిపించారు. మిగతా బీజేపీ నాయకులు కూడా పార్టీ కార్యక్రమాల్లో, సభల్లో జాతీయవాదం గురించే ఎక్కువగా మాట్లాడారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) కథనం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ (26 రోజుల్లో) మధ్యన ప్రధాని నరేంద్ర మోదీ 46 కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు, స్కీములు ప్రారంభించడంతోపాటు అవార్డుల కార్యక్రమాల్లో, మీడియా సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో ఇదే కాలానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 23 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ టైమ్‌లైన్‌ ప్రకారం వాటిలో 11 రాజకీయ ర్యాలీలు కాగా, రెండు విలేకరుల సమావేశాలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో, చిన్న, సూక్ష్మ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, గోవా.. మొత్తం 11 రాష్ట్రాల్లో పర్యటించారు.

పుల్వామా ఉగ్ర దాడిలో కేంద్ర ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్ని విమర్శించకుండా సంయమనం పాటించిన రాహుల్‌ గాంధీ తాను పాల్గొన్న పలు రాజకీయ సభల్లో పుల్వామా బాధితులకు నివాళులర్పించారు. ఫిబ్రవరి 26వ తేదీన భారత వైమానిక దళం పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి జరిపిన బాంబు దాడుల సంఘటనను నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయం చేయడం ప్రారంభించాకే రాహుల్‌ గాంధీ, అందులోని ఔచిత్యాన్ని, తీవ్రతను ప్రశ్నించారు. దాదాపు అన్ని సభల్లో ఆయన రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలోని అవినీతిని, పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టం, జీఎస్టీ భారం, రైతుల దుస్థితి, ఆదివాసీల భూమి హక్కుల గురించే ఎక్కువగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీ పథకాన్ని తీసుకొస్తుందని చెప్పారు.

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు మరణిస్తే నరేంద్ర మోదీ ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణలో నిమగ్నమయ్యారని కూడా రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలతోపాటు ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. తాను ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శిస్తూ వచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా