విజయమే బీజేపీ సంకల్పం

2 Apr, 2019 07:49 IST|Sakshi

మోదీ రాకతో గ్రేటర్‌ కమలదళంలో జోష్‌

‘నమో’ నామస్మరణతో మార్మోగిన ఎల్బీస్టేడియం

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని

దేశ రక్షణ, అవినీతి రహిత పాలనే లక్ష్యమని ప్రకటన

సాక్షి,సిటీబ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ రాకతో మహానగరం కాషాయ దళంలో ఉత్సాహం రెట్టింపైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ ‘విజయ సంకత్ప యాత్ర’ మహాసభలో మోదీ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఆయన ఇక్కడకు వచ్చారు. మోదీ రాక కమల దళంలో జోష్‌ నింపింది. సాయంత్రం 6 గంటలకు మోదీ వేదికపైకి చేరుకోగానే సభికులంతా లేచినిలబడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మోదీ ‘భాగ్యనగర్‌ ప్రజలందరికీ నమస్కారాలు.

దేశరక్షణ కోసం అవినీతి రహిత పాలన కోసం మరోమారు బీజేపీని గెలిపించాలి’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి కార్యకర్తలను, అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ‘మోదీ’ నినాదాలు మిన్నంటాయి. కొంతమంది అభిమానులు మోదీ మాస్కులు ధరించి ‘ఔర్‌ ఏక్‌ బార్‌..మోదీ సర్కార్‌’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన వారికి ఓ వైపు అభివాదం చేస్తూనే మరో వైపు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతి గల్లీకి ఒక చౌకీదార్‌ను తయారు చేయాలని సూచించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం మధ్యమధ్యలో పలు తెలుగు పదాలను వాడి అందరి దృష్టిని ఆకర్షించారు. సుస్థిర పాలన అందాలంటే సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి రాంచందర్‌రావు, చేవెళ్ల అభ్యర్థి జనార్దాన్‌రెడ్డి, హైదరాబాద్‌ అభ్యర్థి భగవంతరావులను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ బహిరంగ సభలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి కృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్, సంకినేని వెంకటేశ్వర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, నాయకులు రఘునందన్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌ సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఇదలా ఉంటే సాయంత్రం వరకు ఎండ, వేడిగాలులు తగ్గకపోవడంతో కార్యకర్తలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఎంఐఎం కుటుంబ పార్టీ: భగవంతరావు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, కేవలం మైనార్టీల అంశాలే తప్ప ఇతర అంశాలను పట్టించుకోడని, ఎంఐఎం ఓ కుటుంబ పార్టీ అని హైదరాబాద్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి భగవంతరావు అన్నారు. అసద్‌ తాను కారు డ్రైవర్‌గా చెప్పుకుంటున్నాడని, మతోన్మాద పార్టీ తోకపట్టుకుని టీఆర్‌ఎస్‌ ఈదుతోందని విమర్శించారు. ఓ కుటుంబం, మతోన్మాదుల చేతుల్లో హైదరాబాద్‌ నలిగిపోతోందని, వారికి వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. హైదరాబాద్‌ వెనుకబడిపోకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. 

ఫాంహౌస్‌కు గులామ్‌లు: జనార్దన్‌రెడ్డి  
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో 16 సీట్లు గెలవబోతున్నట్లు పగటికలలు కంటోందని, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే నీతివంతమైన, సమర్థమంతమైన మోదీ సర్కారు వస్తుందని చేవెళ్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే ఫాంహౌస్‌కు గులాంలు అవుతారని, వారితో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సీఎం కేసీఆర్‌వన్నీ పగటి కలలేనని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశం కోసం, సమర్థవంతమైన పాలన కోసం, దేశరక్షణ కోసం జరుగుతున్నాయన్నారు. తాను చేవెళ్లలో విజయం సాధించి మోదీకి బహుమతిగా ఇస్తానన్నారు. 

వారిపని చెరువుల కబ్జా: రాంచందర్‌రావు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే పెద్దదని, 32 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదేనని బీజేపీ స్థానిక అభ్యర్థి రాంచందర్‌రావు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిందని, ప్రజా ధనానికి కాపలాగా ఉండాల్సిన నేతలే కబ్జాలకు పాల్పడుతున్నారని, అధికార పార్టీకి చెందిన నేతలు చెరువులను కబ్జా చేరన్నారు. ప్రస్తుతం ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారని, ఉగ్రదాడులకు గట్టి జవాబు ఇచ్చే నేతను కోరుకుంటున్నారని అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. 

వారికి ఓటేస్తే మూసీలో వేసినట్లే: కిషన్‌రెడ్డి
నరేంద్రమోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా చెప్పుకుంటున్నారని, ఓ వైపు ప్రపంచ దేశాలు మోదీ పాలనను కీర్తిస్తుంటే కేసీఆర్‌ మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. దేశమంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుతుంటే, కేసీఆర్‌ మాత్రం తన కుటుంబ పాలన కోరుకుంటున్నారన్నారు. ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవేగౌడల సంకీర్ణ ప్రభుత్వాలతో ఎలాంటి నష్టాలు వాటిల్లాయో దేశప్రజలందరికీ తెలుసన్నారు.  

మరిన్ని వార్తలు