మోదీ 2.0 : పదికి పైగా పెరిగిన ఓటింగ్‌ శాతం

23 May, 2019 17:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్టీ, అవినీతి వంటి పలు ఆరోపణలతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేసినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీ ఒంటిచేత్తో విజయాన్ని కట్టబెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 282 స్ధానాలను దాటి  ఆ పార్టీ సొంతంగా 300 స్ధానాలకు పైగా, ఎన్డీయే 343 గెలుచుకునే దిశగా దూసుకువెళుతున్నాయి. భారీ మెజారిటీతో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు కాషాయ దళం సంసిద్ధమైంది.

కాగా, 1957 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి పూర్తి మెజారిటీతో జవహర్‌లాల్‌ నెహ్రూ తన ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత మరో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారీ విజయాన్ని సాధించిపెట్టడంతో పాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన ఓటు శాతాన్ని గత లోక్‌సభ ఎన్నికల్లో 31 శాతం నుంచి ఏకంగా 41 శాతానికి పైగా పెంచుకోవడం విశేషం.

విపక్షాలు ఏకమై ముప్పేట దాడి చేసినా, నోట్లో రద్దు వంటి కొన్ని విధాన నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తి రేపినా ఏకంగా పది శాతం మేర ఓటు శాతం కాషాయ పార్టీకి పెరగడం ఆశ్యర్యం కలిగించక మానదు. దేశ ఎన్నికల చరిత్రలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ఓటు శాతం కంటే రెండంకెల ఓటు శాతం పెంచుకుని అధికారం లోకి రావడం కూడా ఇదే ప్రధమం.

మరిన్ని వార్తలు