పొత్తులకు బీజేపీ సిద్ధమే: మోదీ

11 Jan, 2019 03:49 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, పాత మిత్రులను తాము గుర్తుపెట్టుకున్నామని ప్రధాని మోదీ గురువారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని మోదీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అరక్కోణం, కడలూరు, కృష్ణగిరి, ఈరోడ్, ధర్మపురి జిల్లాల బూత్‌ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకే లేదా రజినీకాంత్‌ పెట్టే పార్టీల్లో దేనితో పొత్తు పెట్టుకుంటుందని ఓ కార్యకర్త అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు.

ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలకు, ఆకాంక్షలకు అటల్‌జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోంది.  వాజ్‌పేయి ఏం చేశారో దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్‌ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు ఒక్కరికే హక్కు ఉందని ఆ పార్టీ భావించింది’ అని విమర్శించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని ఐదు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 39 స్థానాల్లోనూ పోటీ చేయగా ఈ కూటమి రెండే సీట్లు (బీజేపీ, పీఎంకే చెరొకటి) గెలిచింది. తర్వాత ఈ 5 పార్టీలూ బీజేపీతో తమ సంబంధాలను తెంచుకున్నాయి.

మరిన్ని వార్తలు