కేంద్రంలో మళ్లీ మేమే

18 May, 2019 03:18 IST|Sakshi
ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో చిరునవ్వులు చిందిస్తున్న ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా

బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏకు 300పైగా సీట్లు

ప్రధాని అయ్యాక దాదాపు ఐదేళ్ళకు

మొదటి మీడియా భేటీలో ప్రధాని

‘గాడ్సే’ వ్యాఖ్యలపై ప్రజ్ఞను క్షమించలేనన్న మోదీ

న్యూఢిల్లీ/ఖర్గోన్‌(మధ్యప్రదేశ్‌): బీజేపీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి 300పైగా సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. 2014లో ప్రధాని అయ్యాక జరిగిన మొట్టమొదటి మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ చీఫ్‌ అమిత్‌షా నిర్వహించాల్సిన ఈ సమావేశంలో ప్రధాని కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆయన గత ఐదేళ్ల పాలనానుభవం, ప్రస్తుత ఎన్నికలు, ప్రచారం గురించి మాత్రమే మాట్లాడారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడే అంతా చూసుకుంటారని, విలేకరుల ప్రశ్నలకు అమిత్‌షాయే సమాధానమిస్తారని చెప్పారు. ప్రధానిగా అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

అంతా పార్టీ అధ్యక్షుడే చూస్తారు
తమది క్రమశిక్షణ గల పార్టీ అని, అన్ని విషయాలను పార్టీ అధ్యక్షుడే చూసుకుంటారని ప్రధాని తెలిపారు. ‘మేం క్రమశిక్షణ గల పార్టీ సైనికులం. మాకు సర్వస్వం పార్టీ అధ్యక్షుడే. ఐదేళ్లపాటు ప్రధానిగా పనిచేసే అవకాశం ఇస్తూ ఆశీర్వదించిన మీ అందరికీ, మీద్వారా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. పూర్తి మెజారిటీతో ఒకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం గతంలో కొన్ని సార్లు మాత్రమే జరిగింది. ఈసారి 300పైగా సీట్లు తప్పకుండా గెలుచుకుంటాం. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కృషిచేస్తా’ అని తెలిపారు. ‘ప్రచారంలో నాకు మంచి అనుభవాలు ఎదురయ్యాయి.

మా పార్టీ ప్రచారంపై ఎవరైనా పరిశోధన చేయదలచిన వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా అనుకున్న ప్రకారమే అన్ని కార్యక్రమాలను నిర్వహించాం. ఎన్నికల్లో బీజేపీ ప్రచారం అద్భుతంగా సాగింది. అందుకు వాతావరణం కూడా అనుకూలించింది’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల వేదికలను వేరే దేశాలకు మార్చిన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి ఎన్నికలతోపాటు ఐపీఎల్, రంజాన్‌ వంటివి ఏకకాలంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనకుంది. వైవిధ్యభరితమైన మన ప్రజాస్వామ్యంతో ప్రపంచాన్ని మెప్పించాలి’ అని అన్నారు.

రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని మోదీని ఓ విలేకరి ప్రశ్నించగా అమిత్‌ షా జోక్యం చేసుకుంటూ..అన్ని ప్రశ్నలకూ ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు ప్రధాని మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన చిట్టచివరి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ఈసారి 300కు పైగా సీట్లను గెలుచుకుని వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు.  ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, కచ్‌ నుంచి కామ్‌రూప్‌ వరకు ‘ఈసారి 300కు పైగా సీట్లు, మళ్లీ మోదీ ప్రభుత్వమే’ అని దేశం అంటోంది.130 కోట్ల భారతీయుల ఆకాంక్షే బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం. ఆదివారం మీరు ఓటేయడానికి వెళ్లి చరిత్రను లిఖిస్తా రు. దశాబ్దాల తర్వాత దేశంలో వరసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రసు ్తత ఎన్నికలు గతానికి పూర్తిగా భిన్నం. ఈసారి ప్రజలు ఏదో ఒక పార్టీ కోసం కాకుండా దేశం కోసం, నవ భా రత నిర్మాణం కోసం ఓటేస్తున్నారు’ అని తెలిపారు.  

ప్రజ్ఞాసింగ్‌ను క్షమించను: మోదీ
మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తునిగా కీర్తించిన ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను క్షమించలేనని ప్రధాని మోదీ తెలిపారు.  ఖర్గోన్‌లో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని..‘గాంధీజీ లేక గాడ్సేల గురించి ప్రజ్ఞాసింగ్‌ చెడ్డగా మాట్లాడారు. ఆవ్యాఖ్యలు ఖండించ దగినవి. సభ్య సమాజంలో ఇటువంటి భాష, ఆలోచనలకు తావులేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించాలి. ఆమె ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ, నేను మాత్రం మనస్ఫూర్తిగా క్షమించలేకపోతున్నా’ అని అన్నారు.

మళ్లీ మోదీయే ప్రధాని: అమిత్‌షా
నాథూరాం గాడ్సేను పొగుడుతూ భోపాల్‌ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌తోపాటు, కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే, ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీ సిద్ధాంతాలకు అవి వ్యతిరేకమని మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. పది రోజుల్లోగా ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ వారికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అయితే, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్‌ షా తెలిపారు. ఈసారి 300పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ దేశ భద్రత విషయంలో రాజీపడింది.  

మరిన్ని వార్తలు