పాకిస్తాన్‌తో మీ బంధమేంటి?

19 Oct, 2019 03:05 IST|Sakshi
ఉద్ధవ్‌తో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ ప్రశ్న

హిసార్‌/గొహన: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదునుపెట్టారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను పొరుగుదేశం పాకిస్తాన్‌ భారత వ్యతిరేకతను అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు వాడుకుందన్నారు. పాకిస్తాన్‌తో ఉన్న సంబంధమేంటో చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ వంటి పార్టీలు ప్రజల సెంటిమెంట్లను అర్థం చేసుకోలేవని, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను గౌరవించలేవని వ్యాఖ్యానించారు.

ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి కాంగ్రెస్‌ పార్టీ బాధలో ఉందన్నారు. ఆ పార్టీ, అలాంటి ఇతర పార్టీలు ఆ రోజు నుంచి చికిత్స లేని జబ్బుతో బాధపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఆ రోజు గుర్తుందా? అలాంటి నిర్ణయం తీసుకోగలమని ఎవరైనా ఊహించారా? 70 ఏళ్లుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 370ని ఆరోజు తొలగించాం’ అని గుర్తు చేశారు. ‘స్వచ్ఛ భారత్, సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి మేం మాట్లాడితే వారికి కడుపులో నొప్పి. బాలాకోట్‌ పేరెత్తితే ఆ నొప్పి మరింత పెరుగుతుంది’ అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘మోదీని వ్యతిరేకించండి. ఆయనపై ఎన్నైనా ఆరోపణలు చేయండి.

ఎన్ని అబద్ధాలనైనా ప్రచారం చేయండి. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఆ దూషణలు నన్నేం చేయలేవు’ అన్నారు. మోదీని ఎంతైనా తిట్టండి.. కానీ భారతమాతను గౌరవించండి, దేశానికి నష్టం కలిగేలా వ్యవహరించకండి అని కాంగ్రెస్‌ను కోరారు. ‘కాంగ్రెస్‌కు దేశ సమైక్యతపైన, అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగం పైన, భరతమాతపైన, ఈ నేలపైన ఎలాంటి గౌరవం లేదు. అలాంటి పార్టీని మనమెందుకు గౌరవించాలి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని శిక్షించాలా? వద్దా’ అని ఓటర్లను ప్రశ్నించారు. సోనిపట్‌ జిల్లా రైతుల, జవాన్ల, పహిల్వాన్ల భూమి అని మోదీ ప్రశంసించారు. ఈ ప్రాంతంపై తమదే పట్టు అని భావించేవారికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా