ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: మోదీ

12 Jan, 2019 16:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అధికార పార్టీలోని నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐని రాకుండా అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీతో పాటు బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీబీఐని నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో కాంగ్రెస్‌ అధికారాన్ని దుర్వినియోగపరిచి తనపై సీబీఐ విచారణ చేపట్టారని మోదీ పేర్కొన్నారు. సీఎం పదవిలోఉన్న తాను ఏ తప్ప చేయనందుకే చట్టాన్ని గౌరవించి విచారణను ధ్యైరంగా ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తుచేశారు. 

ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ రెండోరోజు సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీ మరణాంతరం జరుపుకుంటున్న మొదటి కౌన్సిల్‌ సమావేశాలని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలన కారణంగా (2004-14) పదేళ్లు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందనీ, విలువైన సమయాన్ని కాంగ్రెస్‌ పాలకులు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పదేళ్లు దేశమంతా అవినీతి స్కాంలు, కుంభకోణాల్లో మినిగితేలిందని ఆరోపించారు.

ఆగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణంలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నందునే విచారణను కప్పిపుచ్చారనీ, ప్రజల సొమ్ముకు తిన్న ఏఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టదని మోదీ హెచ్చరించారు. హిందూవుల డిమాండైన అయోధ్య రామ మందిరాన్ని కోర్టుల్లో కాంగ్రెస్‌కు చెందిన న్యాయవాదులు ఏవిధంగా అడ్డుకుంటున్నారో మనందరికీ తెలుసన్నారు. ఎన్నోఏళ్లు ప్రకటనలకే పరిమితమైన అగ్రవర్ణల రిజర్వేషన్లను తమ ప్రభుత్వం చేసి చూపిందని మోదీ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వేలమంది కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయడానికి ఈ సమావేశం దోహదం చేస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో పాటు జాతీయ నాయకులు పాల్గొన్నారు. 


 

>
మరిన్ని వార్తలు