‘కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉంది’

1 Apr, 2019 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో ఢిల్లీ కంటే వేగంగా అభివృద్ది చెందేదని, ఇక్కడి సీఎం.. ఓటు బ్యాంక్‌ రాజకీయాలు, అతని కుటుంబం వల్ల అభివృద్ది పనులు ఆగిపోయాయని, మజ్లిస్‌ అభివృద్దికి స్పీడ్‌ బ్రేకర్‌ అంటూ.. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ.. మజ్లిస్‌కు రాత్రి నిద్ర పట్టకుండా చేస్తాడీ చౌకీదార్‌ అని అన్నారు. దేశం కోసం మోదీ ఏమైనా చేస్తాడని ట్రిపుల్‌ తలాక్‌ బాధితులకు మేమే అండగా ఉంటామన్నారు. ఆరు నెలల సావాసంతో వారు వీరు అవుతారంటా.. టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ ఆరేళ్లు సావాసం చేశాయన్నారు.

ఐదేళ్లలో ఈ దేశంలో శాంతి ఉందని, పాకిస్తాన్‌ అదుపులో ఉండి బాంబ్‌లు పేలే ప్రభుత్వం కావాలా? దేశాన్ని కాపాడే ప్రభుత్వం కావాలా? అంటూ ప్రశ్నించారు. దేశం కోసం పాకిస్తాన్‌ ఇంట్లో చొరబడి ఉగ్రవాదులను ఖతం చేస్తామన్నారు. దేశముంటేనే ఎన్నికలు వస్తాయని, అసలు దేశమే లేకపోతే.. ఏం చేస్తామన్నారు. కాశ్మీర్‌లో ప్రత్యేక ప్రధాని కావాలని కాంగ్రెస్‌ మిత్రపక్షం అంటోందని దీనికి మీరు ఒప్పుకుంటారా అని ప్రజల్ని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్‌ బదులుచెప్పాలన్నారు. యూటర్న్‌ చంద్రబాబు ఫరూక్‌ అబ్దుల్లాతో ర్యాలీ తీశాడని, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలంటా.. ఇది బాబుకు ఓకేనా అంటూ ప్రశ్నించారు. శరద్‌ పవార్‌, దేవేగౌడ, దీదీ, మణిశంకర్‌ అయ్యర్‌లు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

గత ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం చేసిన పనులను చెప్పడానికే వచ్చానన్నారు. ఇక్కడి ప్రజల ప్రేరణతోనే.. దేశ సేవ చెయ్యగలుగుతున్నాని అన్నారు. మధ్య తరగతి ప్రజల ప్రతీ అవసరం తీర్చడానికి అన్ని వసతులు చేశానన్నారు. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఎవరూ కూడా ఆలోచన చెయ్యలేదన్నారు. ఇవాళ విద్య, వైద్యం, ఇంటి సరుకులు.. అన్నీ వారికి చేరువలో ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్‌లోనే ట్యాక్స్‌ పరిమితిని రూ.5లక్షలకు పెంచామని గుర్తుచేశారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభమే కదా అని అన్నారు.

యువకుల ఆకాంక్షలు నెరవేర్చే నగరం ఈ హైదరాబాద్‌ అని.. ఇక్కడ 15వేలకు పైగా స్టార్టప్‌లతో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. ముద్రా ద్వారా యువకులకు కొత్త అవకాశాలు వచ్చాయని, ఉద్యోగం అడగటం కాదని, ఉద్యోగం ఇచ్చే దిశలో యువకులు తయారయ్యారని అన్నారు. కాశ్మీర్‌లో గవర్నర్‌ రూల్‌ పెట్టగానే.. పీడీపీ, ఎన్సీపీ, కాంగ్రెస్‌ అన్నీ కలిసిపోయాయన్నారు. పంచాయతీ ఎన్నికలు కూడా ఆపాలని చూశారని, అయితే మూడు వేలకు పైగా పోటీ చేసి వీళ్లని తిరస్కరించారన్నారు. ఇది కాంగ్రెస్‌జమానా కాదనీ, మోదీ జమానా అని అన్నారు. ప్రజలు బీజేపీ సర్కార్‌ కోసం ఇప్పటికే సిద్దమయ్యారని, మీ ఓటు మోదీ కోసం.. ధృడమైన సర్కార్‌ కోసం అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు