కేదార్‌నాథ్‌లో మోదీ

19 May, 2019 05:16 IST|Sakshi
కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్‌ సంపద్రాయ వేషధారణలో వస్తున్న ప్రధాని మోదీ

ప్రత్యేక పూజలు చేసిన మోదీ

నేడు బద్రీనాథ్‌ ఆలయ సందర్శన

కేదార్‌నాథ్‌(ఉత్తరాఖండ్‌): హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శనివారం ఉదయమే డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ బూడిద రంగు సంప్రదాయ దుస్తులు ధరించారు. హిమాచల్‌ సంప్రదాయ టోపీ పెట్టుకుని కాషాయరంగు కండువాను నడుముకు చుట్టుకున్నారు.

సుమారు అర్ధగంట పాటు ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మందాకినీ నదీ సమీపంలో ఉన్న ఈ 11,755 అడుగుల ఎత్తుగల కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం కేదార్‌నాథ్‌లో 2013 జూన్‌లో వచ్చిన భారీ వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ పనులను సమీక్షించారు. ఉత్తరాఖండ్‌ చీఫ్‌ సెక్రటరీ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ ఆ పనుల గురించి ప్రధానికి వివరించారు. మధ్యాహ్నం సమయంలో కాసేపు ధ్యానం చేసుకోడానికి ఆలయం సమీపంలోని ‘ధ్యాన్‌ కుతియా’అనే గుహకు వెళ్లారు. ప్రధాని రాత్రికి అక్కడే గడిపి ఆదివారం ఉదయం బద్రీనాథ్‌కి వెళ్తారు. బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు.

ఇక రెండేళ్లలో మోదీ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో బీజేపీ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ మాట్లాడుతూ ‘ఆధ్యాత్మిక సందర్శన కోసం మాత్రమే ప్రధాని ఇక్కడికి వచ్చారు’అని తెలిపారు. ప్రధాని రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రధాని పూజల నేపథ్యంలో భక్తులెవరినీ ఆలయం సమీపంలోకి కూడా అనుమతించలేదని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్‌ మంగేశ్‌  చెప్పారు. బద్రీనాథ్‌ ఆలయం సందర్శన అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటనకు ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇంకా అమల్లోనే ఉందని ప్రధాని కార్యాలయానికి సూచించింది.

మరిన్ని వార్తలు