ఆర్‌ఎస్‌ఎస్‌ నెం.2గా మోదీ అనుచరుడు?

9 Mar, 2018 15:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ శుక్రవారం నాగపూర్‌లో ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త సర్కార్య వాహ్‌గా అంటే, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొంటారు. ప్రస్తుతం ఈ పదవిలో సురేశ్‌ భయ్యాజీ జోషి కొనసాగుతున్నారు. ఆయన 2015 సంవత్సరంలోనే పదవి నుంచి దిగిపోవాల్సి ఉండగా, ఆయన పదవీకాలాన్ని పొడగిస్తూ వస్తున్నారు.

ఆయన స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సహ్‌ కార్యవాహ్‌ లేదా సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే ఎన్నికవుతారని భావించారు. ఆయన ఎన్నిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. హొసబలే ఎన్నికయితే  ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా నరేంద్ర మోదీ ప్రభావం ఉంటుందని, తత్‌ ఫలితంగా ఆయన ప్రభుత్వంపైన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం లేదా పట్టు కోల్పోతుందని భావించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిష్టానం భావిస్తూ వచ్చింది. అందుకని హొసబలేను ఎన్నుకునేందుకు ప్రయత్నం జరిగినప్పుడల్లా అడ్డుకుంటూ వస్తోంది.

దత్తాత్రేయ హొసబలే ప్రధాని నరేంద్ర మోదీ మనిషి. రాజకీయాల పట్ల అమితాసక్తి కలిగిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మనిషిగా ఆయన కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌గా కొనసాగుతున్న సురేశ్‌ భయ్యాజీ జోషి రాజకీయాల పట్ల ఆసక్తి లేని వ్యక్తి. పైగా సంస్థ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. నరేంద్ర మోదీ 2015లోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా హొసబలేను ప్రతిపాదించారు. అప్పుడు ఆయన్ని కాదని జోషికే మరో మూడేళ్లపాటు పదవీకాలాన్ని పెంచారు. మధ్యలో జోషి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన స్థానంలో హొసబలే నియామకాలనికి ప్రయత్నాలు జరిగాయి. మోకాలి చిప్ప ఆపరేషన్, 30 కిలోల బరువు తగ్గడం వల్ల జోషినే కొనసాగిస్తూ వచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అధిష్టానంలో  ప్రధాన కార్యదర్శి (సర్కార్య వాహ్‌), డిప్యూటీ ప్రధాన కార్యదర్శి (సర్‌ సంఘ్‌చాలక్‌), నలుగురు సంయుక్త కార్యదర్శులు (సహ్‌ సర్కార్య వాహ్‌) ఉంటారు. ప్రధాన కార్యదర్శి కార్యవర్గం అధిపతిగా ఉంటారు. డిప్యూటి ప్రధాన కార్యదర్శి సంస్థకు గైడ్‌గా, ఫిలాసఫర్‌గా ఉంటారు. ప్రస్తుతం ఈ హోదాలో మోహన్‌ భగవత్‌ కొనసాగుతున్నారు. హొసబలే సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సంస్థ అఖిల భారతీ ప్రతినిధి సభకు అధ్యక్షత వహించడమే కాకుండా సంస్థ కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ప్రస్తుతం సర్‌ సంఘ్‌చాలక్‌ నే సంస్థ చీఫ్‌గా, ప్రధాన కార్యదర్శిని నెంబర్‌ -2గా పరిగణిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆర్‌ఎస్‌ఎస్‌లో నరేంద్ర మోదీ బలం మరింత పెరిగిందని, ఈ కారణంగా ఈసారి హోసబలే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌గా ఎన్నిక కావచ్చని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

>
మరిన్ని వార్తలు