ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు

8 May, 2018 02:10 IST|Sakshi
బెంగళూరులో మీడియాతో మన్మోహన్‌

మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజలకు ఇక్కట్లు

దేశాభివృద్ధి 14 ఏళ్లు వెనక్కి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌  

సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన విధానాల్ని అవలంబిస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన తప్పుపట్టారు. సమాజాన్ని విడగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ఆయన వాడుతున్న భాష ప్రధాని స్థాయి వ్యక్తి వాడదగింది కాదని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం బెంగళూరుకు వచ్చిన ఆయన కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

బ్యాంకింగ్‌ మోసాలు నాలుగురెట్లు
‘ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ యూపీఏ హయాంలో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా కొనసాగింది. ప్రస్తుత ప్రధాని మోదీ పాలనలో దేశాభివృద్ధి 14 ఏళ్లు వెనక్కి వెళ్లింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు’ అని మన్మోహన్‌ విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 67 శాతం తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచారని, మోదీ హయాంలో ఎక్సైజ్‌ పన్నులను మితిమీరి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో బ్యాంకింగ్‌ మోసాలు నాలుగురెట్లు పెరిగాయని, పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ లోపం వల్ల బ్యాంకింగ్‌ రంగంపై ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నగదు కొరత విపరీతంగా వేధిస్తోందని, మంచివని ప్రచారం చేస్తూ మోదీ ప్రవేశపెడుతున్న విధానాలు చివరకు నష్టాల్ని మిగులుస్తున్నాయని ఎద్దేవా చేశారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పరారీపై మాట్లాడుతూ.. 2015, 2016 సంవత్సరాల్లో ఏదో తప్పు జరుగుతుందన్న సంకేతాలు వెలువడినప్పటికీ మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  

తీవ్ర సంక్షోభంలో రైతన్న
‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది’ అని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీయే హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు శూన్యమని, వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోందని తప్పుపట్టారు. ‘వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 21 శాతం తగ్గిపోయాయి.

మోదీ మాత్రం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్టుబడులు 34–35 శాతం పెరిగాయని, మోదీ హయాంలో ఆ రంగం పూర్తిగా దెబ్బతిందని మన్మోహన్‌ విమర్శించారు. ‘కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో తిరోగమనంలో పయనిస్తోంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారు. అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతింది’ అని మన్మోహన్‌ మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు