దేశం చూపు.. తెలంగాణ వైపు

8 Apr, 2019 06:47 IST|Sakshi
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చిత్రంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సూరారం: దేశం చూపంతా తెలంగాణ రాష్ట్రం వైపే ఉందని, ఈ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం ఇక్కడి పథకాలనే కాపీ కొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలవాసులతో ఆదివారం కొంపల్లి పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో కేటీఆర్‌ సమావేశయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... మన పార్టీ కాదు.. మన పొత్తు లేని అరుణ్‌ జైట్లీ ఇవాళ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారని గుర్తుచేశారు. నాడు ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, ప్రస్తుత ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణను బంగారు బాటలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పారిశ్రామికవాడ ప్రాంతంలో నివసించే ప్రజలు పడుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి వైపునకు తరలిస్తామని, ఆర్టీసీలో నడుస్తున్న 4 వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రానిక్‌ బస్సులను నడుపుతామన్నారు. ఇప్పటికే 40 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌లో పనిచేసే చెత్త ఆటోలు, డంపింగ్‌ వాహనాలను కూడా మార్చి ఎలక్ట్రానిక్‌ వాహనాలు ఏర్పాటు చేస్తామని చెప్పా రు. నగర వ్యాప్తంగా ఉన్న 40 చెరువులను అభివృద్ధి చేసి వాటి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాౖలైన రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో పోటీకి దింపారని,  అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 11న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

కేటీఆర్‌ సమక్షంలో చేరికలు
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్, కాంగ్రెస్‌నేత టి.లక్ష్మారెడ్డితో పాటు పుప్పాల భాస్కర్, గాగిల్లాపూర్‌కు చెందిన రంజిత్‌రెడ్డిలు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌ ల ఆధ్వర్యంలో కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు