22న ఏపీలో హైవేల దిగ్బంధనం

21 Mar, 2018 14:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. ఈ నెల 22న చేపట్టబోయే జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి 22 ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తున్నట్టు తెలిపారు.

అయితే ఈ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీకి చిత్తశుద్ధి వుంటే ఈ కార్యక్రమానికి సహకరించాలంటూ పిలుపునిచ్చారు. టీడీపీ ఎటువంటి ఆటంకాలు కల్పించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంటులో అవిశ్వాసం ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదని అన్నారు. సరళీకరణ విధానాలను అవలంభిస్తున్న బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ బండారం ఎక్కడ బయటపడతుందోనని భయపడుతోందని ఆరోపించారు.

ఇదే విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందిస్తూ.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి టీఆర్‌ఎస్‌ లాలుచీ పడిందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకేలు చర్చకు సహకరించాలని కోరారు. రాష్ట్రానికి రైల్వేజోన్‌ ఇవ్వకపోగా, ఉన్న రైళ్లను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఎలా రద్దు చేస్తారంటూ నిలదీశారు. రేపు ఉదయం కనకదుర్గమ్మ వారధి వద్ద జాతీయ రహదారి నిర్బంధం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడాని అన్ని పార్టీలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు