జాతి భద్రతను ఆదాయంగా మార్చారు

16 Dec, 2018 03:08 IST|Sakshi
ప్రధాని మోదీ

బలగాల స్థైర్యాన్ని దెబ్బతీశారు

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం

చెన్నై: దేశభద్రతను, రక్షణ రంగాన్ని కాంగ్రెస్‌ నేతలు పంచింగ్‌ బ్యాగ్‌గానూ, ఆదాయవనరుగానూ మార్చుకున్నారని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమ ప్రయోజనాల కోసం భద్రతాబలగాల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓవైపు ఆర్మీ చీఫ్‌లను పేర్లతో పిలుస్తూ అవమానిస్తారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను హేళన చేస్తారు. మరోవైపు 1940–50  దశకాల్లో జీపుల కుంభకోణం నుంచి 1980ల్లో బోఫోర్స్, తాజాగా అగస్టా ఇంకా చాలా కుంభకోణాలతో దేశ రక్షణరంగాన్ని దోచేశారు. కాంగ్రెస్‌ నేతలకు కావాల్సిందల్లా ప్రతీ ఒప్పందం నుంచి ఆదాయం పొందడమే’ అని దుయ్యబట్టారు.

‘సాయుధ బలగాలు చాలాకాలంగా కోరుతున్న ఒకే ర్యాంక్‌–ఒకే పెన్షన్‌(ఓఆర్‌ఓపీ) విధానాన్ని పూర్తిచేసిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే. ఈ డిమాండ్‌ను గత 40 సంవత్సరాలుగా మురగబెట్టారు. సాయుధబలగాలు, మాజీ సైనికులు గట్టిగా కోరడంతో యూపీఏ ప్రభుత్వం ఓఆర్‌ఓపీ కోసం రూ.500 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇది సైనికుల సమస్యలపై క్రూరంగా నవ్వడంలాంటిదే’ అని అన్నారు. ‘తమిళనాడులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంత గొప్పగా సేవ చేయగలమో ఒక్కసారి ఆలోచించండి’ అని మోదీ చెప్పారు. మరోవైపు, మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు.  సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు