కాళేశ్వరానికి జాతీయ హోదా!

27 Mar, 2019 03:36 IST|Sakshi

16 మంది ఎంపీలను గెలిపిస్తేనే సాధ్యం: హరీశ్‌

నర్సాపూర్‌/చిన్నశంకరంపేట (మెదక్‌): టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలకు ఓటేసి గెలిపిస్తే ఢిల్లీని శాసించి... కేంద్రం మెడలు వంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆరోపించారు. మంగళవారం మెదక్‌ జిల్లా నర్సా పూర్‌తోపాటు చిన్నశంకరంపేటల్లో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. కేసీఆర్‌ ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌కు ఓట్లు వేసినా, కార్యకర్తలు లేని బీజేపీకి ఓటేసినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. అడిగితే దయ చూపరని, తెలంగాణలోని 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రాన్ని శాసిస్తేనే నిధుల వరద పారుతుందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌ గాంధీకి, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోదీకి లాభమని, వారికి ఓటేస్తే ఎన్నికల అనంతరం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుందని హరీశ్‌ అన్నారు. అదే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే రాష్ట్రంలోని రైతులందరికీ లాభమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, తెలంగాణ అంటే ఆ పార్టీకి చిన్న చూపని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు