సోషల్‌ మీడియాతో రిలేషన్‌

29 Dec, 2017 10:55 IST|Sakshi

బీజేడీ కొత్త పోకడ

ప్రజాప్రతినిధులు, క్యాడర్‌కు నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలు

వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఆరాటం

ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేసి దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేడీని కూలదోయాలని బీజేపీ ఆరాటం..గత వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ పోరాటం..ఎటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనైనా ఆధిపత్యం నిలబెట్టుకోవాలని అధికార బీజేడీ తాపత్రయం..వెరసి రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి.

భువనేశ్వర్‌: రాష్టంలో దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న బిజూ జనతా దళ్‌ను గద్దె దించాలనే యోచనతో భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. క్రమంగా ఉనికిని కోల్పోతున్న తాము ఈ సారి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్‌ ఆశల పల్లకిలో విహరిస్తోంది. ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను ఎలాగైనా చిత్తుచేసి ఆధిపత్యం నిలబెట్టుకోవాలని   బిజూజనతా దళ్‌ అనుక్షణం పరిశోధిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ బాధ్యతలకు ప్రత్యక్షంగా సారథ్యం వహిస్తున్నారు. ప్రజాభీష్టంతో విజయం తథ్యమని ఇటీవల జరిగిన పార్టీ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ శ్రేణులకు ఆయన ప్రబోధించారు. ప్రజల మనసు దోచుకోవడంలో ప్రభుత్వ నిధులు, యంత్రాంగం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు తెరపైకి రాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్‌ టీ (టీమ్‌వర్క్‌–ట్రాన్స్‌పరెన్సీ– టెక్నాలజీ) కార్యాచరణతో అధికారుల్ని కట్టుదిట్టం చేశారు. అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికారుల ఆధ్వర్యంలో క్షేత్ర  స్థాయిలో ప్రజా ప్రతినిధులను పూచీదారులుగా గురిపెట్టిన నవీన్‌ పట్నాయక్‌ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని సోషల్‌ మీడియా సమూహంలో చేర్చేందుకు కంకణం కట్టుకున్నారు.

వాట్సాప్‌ వినియోగంపై అవగాహన
పార్టీ వర్గీయులు  వాట్సాప్‌ వినియోగంపట్ల పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం నవీన్‌ నివాస్‌ ప్రాంగణంలో పార్టీ వర్గీయులకు వాట్సాప్‌ వినియోగంపట్ల ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా వాట్సాప్‌  ఖాతాల్ని తెరవాలని ఆదేశించారు. వార్డులవారీగా వాట్సాప్, ఫేస్‌ బుక్‌ ఆధ్వర్యంలో ప్రజలతో ప్రత్యక్షంగా సంప్రదించాలి. వారి బాగోగుల్ని నమోదు చేసుకోవాలి. ప్రజా సంక్షేమం, సామాజిక పురోగతి, ప్రాంతీయ అభివృద్ధి వగైరా రంగాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆకర్షణీయ పథకాల కార్యాచరణకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రసారం చేయడం అనివార్యంగా నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ, స్థానిక, క్షేత్ర ప్రజా ప్రతినిధులంతా ప్రజల అభియోగాలు, ఆరోపణలు, ఫిర్యాదులపట్ల సోషల్‌ మీడియా సమూహంలో స్పందిస్తూ ఉండాలని ప్రబోధించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వాట్సాప్‌  సమూహాన్ని ఆవిష్కరించాలని సూచించారు. అసెంబ్లీ పరిధిలో వార్డులవారీగా ప్రజల బాగోగుల్ని అనుబంధ (పార్టీకి చెందిన) ప్రజా ప్రతినిధులు ఎవరికి వారుగా స్పందించాలని తాజా మార్గదర్శకం జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ఇతరేతర వర్గాల వాట్సాప్,  ఫేస్‌బుక్‌ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  ప్రకటించారు.

స్మార్ట్‌ ఫోన్లు వాడాలి
సోషల్‌ మీడియాతో ప్రజాసంబంధాల్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లను వినియోగించడం నేర్చుకోవాలి. కాలక్షేపానికి స్మార్ట్‌ఫోన్‌కు పరిమితం కాకుండా ప్రజా ప్రాతినిధ్యం నిత్యం బలపడేందుకు వినియోగించుకోవడమే కొత్త మార్గదర్శకం సారాంశంగా నవీన్‌పట్నాయక్‌ పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్‌ మీడియా వేదిక కంటే ఘనమైనది ఏదీ లేదు. ప్రజల వద్దకు పాలన పేరుతో నవీన్‌ పట్నాయక్‌ ఏటా జనసంపర్క్‌ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ జయంతిని పురస్కరించుకుని లోక్‌ నాయక్‌ జయ ప్రకాష్‌ నారాయణ్‌ జయంతి వరకు ఏటా నిరవధికంగా బీజేడీ జన సంపర్క్‌ పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారు.  మారిన కాలమాన పరిస్థితుల్లో ఏడాదికోసారి సంప్రదింపులు అరకొరగా మిగులుతాయి. ప్రతిపక్షాల విమర్శల్ని నీరు గార్చేందుకు పార్టీ వర్గీయులు సోషల్‌ మీడియాలో ప్రజలతో నిత్యం సంప్రదించడం తప్పనిసరిగా గుర్తించారు.

కాలానికి అనుగుణంగా మారిన నవీన్‌
దిగువ స్థాయి కార్యకర్తల్లో ఈ ఉత్సాహాన్ని ప్రేరేపించేందుకు కొన్ని నెలల ముందుగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సెల్ఫీ ముచ్చటను ఆచారంగా మార్చుకున్నారు. లోగడ ఆయన జన సమూహంలో ప్రత్యక్షంగా హాజరయ్యేది అత్యంత సూక్ష్మం. మీడియా వ్యాఖ్యల్లో ఎంతో సూక్ష్మత ప్రదర్శించి మెరుపు వేగంతో కనుమరుగయ్యేవారు. ప్రతిపక్షాల పోటు పెరగడంతో ఈ వ్యవహారాన్ని దారి తప్పించి ప్రజలతో ప్రత్యక్షంగా ముచ్చటించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ట్విటర్‌ ఖాతాల్ని తెరిచారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ రాజకీయ వ్యవహారాలపట్ల సోషల్‌ మీడియా ప్రసారంలో పాలుపంచుకోవడం ప్రారంభించారు. మలి దశలో ఈ సంస్కృతిని అధికారులకు కట్టబెట్టారు. తాజాగా పార్టీ శ్రేణుల్ని సోషల్‌ మీడియాలో విలీనం చేసి భవిష్యత్తులో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ప్రజలతో సంపర్కాల్ని బలోపేతం చేస్తుండడం విశేషం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా