నవీనమా...వికాసమా

24 Mar, 2019 07:23 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ :  చీకట్లో మగ్గిన ఒడిశా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు నింపిన ప్రజాకర్షక నాయకుడు ఇప్పుడు ఏటికి ఎదురీదుతున్నారా? పందొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నవీన్‌ పట్నాయక్‌ పాలనకు ఇక తెరపడుతుందా? బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందా? 120 సీట్లు తమ లక్ష్యమని బీజేపీ ప్రకటిస్తే, 123 గెలుస్తామన్న ధీమా నవీన్‌ది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? అయిదోసారి కూడా నవీనపథంలో ప్రజలు నడుస్తారా? లేదంటే ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతారా?.. ఇప్పుడు అందరిలోనూ అదే ఆసక్తి..

సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఒడిశా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులున్న ఈ రాష్ట్రంలో ఆదివాసీలే ఎక్కువ. ఎటు చూసినా పేదరికం, ఆకలి కేకలు, ఉద్యోగాల కొరత.. వీటికి తోడు పులి మీద పుట్రలా ఎప్పుడు తుపాన్లు ముంచేస్తాయో తెలియదు. అలాంటి రాష్ట్రానికి ఆపద్బాంధవుడిలా వచ్చారు బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌. 2000 సంవత్సరంలో ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఆయన.. అవినీతి బురదలో కూరుకుపోయిన అధికారులు, రాజకీయ నాయకుల్లో మార్పు తెచ్చారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు తీయించారు.

సుపరిపాలన, ప్రజాసేవ, ఇతరుల్ని గౌరవించడమే పార్టీ నినాదాలుగా మార్చుకొని జనంలో పట్టు పెంచుకున్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఒకప్పటి ముఖ్యమంత్రి, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్‌ కుమారుడైన నవీన్‌ పట్నాయక్‌ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదు. బొగ్గు, బాక్సైట్, ఉక్కు, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండడంతో వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేశారు.

మైనింగ్‌ కార్యకలాపాలతోనే మధ్య తరగతి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గత అయిదేళ్లలో రాష్ట్ర జీడీపీ సగటున 6.66 శాతం పెరుగుతూ వచ్చింది. ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచడానికి చర్యలు చేపట్టారు. గత ఏడాది దేశవ్యాప్తంగా నెలకొన్న మోదీ ప్రభంజనంలోనూ నవీన్‌ పట్నాయక్‌ సొంతంగానే అఖండ మెజార్టీని సొంతం చేసుకున్నారు. 147 అసెంబ్లీ స్థానాలకు 117 కైవసం చేసుకున్నారు. 21 లోక్‌సభ స్థానాల్లో 20 సీట్లలో విజయకేతనం ఎగురవేశారు. 

నవీన్‌కు ఎందుకింత ఆదరణ?
సిక్కింలో పవన్‌కుమార్‌ చామ్లింగ్, త్రిపురలో మాణిక్‌ సర్కార్, పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు.. ఒకే రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రుల సరసన నవీన్‌ పట్నాయక్‌ కూడా చేరారు. నాలుగేళ్లు వరసగా అధికారం దక్కించుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారని జనం బలంగా నమ్మడం మొదటి కారణం.

రెండోది– ప్రతిపక్షాల బలహీనతలు. కాంగ్రెస్‌ పార్టీలో జేబీ పట్నాయక్‌ హవా తగ్గిపోయాక నవీన్‌ పట్నాయక్‌ను ఢీకొట్టే నాయకుడే కనిపించలేదు. బీజేపీ కూడా ఇప్పటివరకు సమర్థుడైన నాయకుడ్ని తయారు చేయలేకపోయింది. 2008లో ఆదివాసీల అభ్యన్నతి కోసం పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన మత ప్రచారకుడు గ్రహం స్టెయిన్స్, ఆయన పిల్లల్ని వీహెచ్‌పీ కార్యకర్తలు ఖందమాల్‌లో దారుణంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

దీంతో అప్పటివరకు ఎన్డీయేతో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ఆ కూటమితో తెగదెంపులు చేసుకొని సెక్యులర్‌ నాయకుడిగా ఎదిగారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ఒడిశాలో 2013లో ఫైలాన్‌ తుపాను సమయంలో ఆయన చూపించిన సన్నద్ధత తీసుకున్న చర్యల్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. 
అంతర్గత పోరే ఎసరు పెడుతుందా?

నవీన్‌ పట్నాయక్‌కు జనంలో ఎంత చరిష్మా ఉన్నా.. సొంత పార్టీలో వ్యతిరేకత ఈసారి బలంగానే కనిపిస్తోంది. రెండో స్థాయి నాయకత్వాన్ని ఎదగనీయకుండా పార్టీని తన గుప్పెట్లో ఉంచుకోవడం మైనస్‌గా మారింది. గత కొన్నేళ్లలో 36 మంది మంత్రులపై ఏకపక్షంగా వేటు వేశారు. బీజేడీని స్థాపించిన తొలినాళ్లలో నవీన్‌కు అండదండగా ఉన్నవారినే తొలగించారు.

వ్యవస్థాపక సభ్యుడు బిజయ్‌ మహాపాత్రో, రాజకీయ సలహాదారు పైరిమోహన్‌ మహాపాత్రో వంటి వారిని చాలా ఏళ్ల క్రితమే పార్టీ నుంచి గెంటేశారు. మూడేళ్లుగా నవీన్‌ పట్నాయక్‌ ప్రైవేటు సెక్రటరీ వి.కె.పాండ్యన్‌ ఆడింది ఆటగా మారింది. పోస్కో స్టీల్‌ప్లాంట్, మరికొన్ని నేచురల్‌ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. పాండ్యన్‌ రాజ్యాంగేతర శక్తిగా ఎదగడంతో ఎంపీ బలభద్ర మాఝి, ఎమ్మెల్యేలు సుకాంత నాయక్, త్రినాథ్‌ గొమాంగో పార్టీని వీడారు. 

బీజేపీ బలం ఎలా పెరుగుతోందంటే..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాలాకాలంగా ఒడిశాపై దృష్టి పెట్టారు. 120+ సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి షా.. వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మోదీ, షా తరచూ ఒడిశాలో పర్యటిస్తున్నారు. 2012లో 36 జిల్లా పరిషత్‌లను సాధించిన బీజేపీ, గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 297 స్థానాల్లో గెలుపొందింది. ఇది కచ్చితంగా నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌కు డేంజర్‌ బెల్స్‌ మోగినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక బలభద్ర మాఝీ వంటి వారి చేరికతో మరింత బలం చేకూరింది. బాలాకోట్‌ దాడుల తర్వాత ఒడిశాలో జాతీయ భావం బాగా పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రేజ్‌ పెరిగింది. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు. అయితే రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా హిందీ రాష్ట్రాల్లో గెలుపొందిన ఆత్మవిశ్వాసంతో ఒడిశాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. తరచూ ఒడిశా వెళుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే బీజేడీ వర్సెస్‌ బీజేపీ మధ్య పోటీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు

  • ఆకలి మరణాలు, ఆదివాసీలు ఎక్కువుండే ఈ రాష్ట్రంలో కోటి మంది కరువు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు 
  • నిరుద్యోగం 6.6 శాతానికి చేరుకుంది. 85 లక్షల మంది యువత ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి
  • వ్యాపారాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటంతో సామాన్యుల్లో అసంతృప్తి.. ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం 

బీజేడీ 
అనుకూల అంశాలు

  • సీఎం నవీన్‌ పట్నాయక్‌పై జనంలో సడలని నమ్మకం
  • 19 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలతో పాటు పారిశ్రామిక ప్రగతి
  • మహిళలకు 33 శాతం టికెట్ల కేటాయింపు 

ప్రతికూల అంశాలు

  • 19 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత
  • బీజేడీ నుంచి నాయకులు పార్టీని వీడడం 

బీజేపీ
అనుకూల అంశాలు

  • క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పట్టు
  • బీజేడీ నుంచి తరలివస్తున్న నాయకగణం
  • పుల్వామా తర్వాత ప్రజల్లో పెరిగిన దేశభక్తి 

ప్రతికూల అంశాలు

  • సమర్థులైన నాయకుల కొరత
  • నవీన్‌ పట్నాయక్‌కు ఉన్న జనాకర్షణ 
మరిన్ని వార్తలు