కేసీఆర్‌ ఊసరవెల్లిని మించిన వ్యక్తి: సిద్ధు

30 Nov, 2018 18:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చి గద్దెనెక్కారని కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు విమర్శించారు. బైద పీపుల్‌ తెలంగాణలో ఫర్‌ద పీపుల్‌గా మారిందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 40 శాతం ప్రజలు రోజుకు కనీసం 140 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్‌ తన కోసం రూ. 300 కోట్ల భవంతిని నిర్మించుకున్నారని మండిపడ్డారు. వెదురు బొంగు పొడుగ్గానే ఉన్నా.. లోనంత డొల్లేనని.. తెలంగాణ పాలన కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు. రూ.17 వేల కోట్ల మిగులు రాష్ట్రాన్ని రూ. 2లక్షల 40వేల కోట్ల అప్పుల మయం చేశారని ఆరోపించారు. నలుగురి ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయని దుయ్యబట్టారు.

‘సోనియాగాందీ వల్లే తెలంగాణ ఏర్పడింది. పార్టీ విలీనం, దళిత సీఎం అన్నారు. ఊసరవెళ్లి కంటే వేగంగా రంగు మార్చి ఆయనే గద్దే పైన కూర్చున్నారు. మహిళల సాధికారిత అంటే కేసీఆర్ దృష్టిలో ఆయన కూతురు ఒక్కరి అభివృద్దినేనా? ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? దేశంలో సచివాలయంకు పోకుండా ఇంటి నుంచి పాలన చేసే ఏకైక సీఎం కేసీఆర్‌. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు ఇద్దరూ ఒకటే. నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం’ అని సిద్ధు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు