బాల్‌ఠాక్రే సమాధి నుంచి లేచొస్తారు!

23 Dec, 2017 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్‌ ఠాక్రే నిజ జీవితం ఆధారంగా తీస్తున్న ‘బాల్‌ ఠాక్రే’ సినిమాలో టైటిల్‌ పాత్రను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ పోషించడం పట్ల ఇప్పుడు వివాదం రాజుకుంటోంది. హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ముస్లిం మైనారిటీలను వ్యతిరేకించిన బాల్‌ ఠాక్రే పాత్రలో ఓ ముస్లింను ఎలా తీసుకున్నారని ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ విషయం బాల్‌ ఠాక్రేకే తెలిస్తే ఆయన సమాధి నుంచి లేచొస్తారని మరి కొందరు వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో మరాఠీలకే ఉపాధి అవకాశాలు ఉండాలంటూ పోరాడిన బాల్‌ ఠాక్రే యూపీ, బిహార్‌ రాష్ట్రాల నుంచి ముంబై నగరానికి ప్రజల వలసలను, ముఖ్యంగా మైనారిటీల వలసలను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి జీవిత కథను తెరకెక్కిస్తూ ఓ మైనారిటీ ముస్లింను, అందులోనూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటుడిని తీసుకోవం ఏమిటని వారు విమర్శించారు. మరాఠీ నటులను ఎందుకు ఎంపిక చేయలేదని వారు ప్రశ్నించారు. యూపీ, బీహార్‌ నుంచి ప్రజల వలసలను వ్యతిరేకిస్తూ బాల్‌ ఠాక్రే కొన్నిసార్లు విధ్వంసకర ఆందోళనలకు కూడా దిగారు.

హిందూ ఛాందసవాద నాయకుడి పాత్రకు ఓ ముస్లిం నటుడిని తీసుకోవడం పట్ల కొందరు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఠాక్రే పాత్రలో ముస్లిం చూపించడం ఎంత చల్లని మాటని కొందరంటే ‘ఆహా! ఏమి వైరుధ్యవైవిధ్యము’ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఠాక్రే పాత్ర కోసం యూపీ నుంచి సిద్దిఖీని తీసుకున్నట్టే బీహార్‌ నుంచి రవి కిషన్‌ను తీసుకుంటే తానింకా ప్రశాంతంగా మరణిస్తానని ఒకరు వ్యాఖ్యానించారు.


ఠాక్రేను తెరపై చూపించడం ఇదే మొదటిసారి కాదని, ఓ ముస్లింను ఆయన పాత్రలో చూపించడం ఇదే మొదటిసారని, దాన్ని తాను హదయపూర్వకంగా హర్షిస్తున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ తన జర్నలిస్ట్‌ పాత్ర ద్వారా ప్రేక్షకులను విశేషంగా మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సిద్దిఖీ ‘బాల్‌ఠాక్రే’ చిత్రంలో ఠాక్రేగానే కాకుండా దేశ విభజన సందర్భంగా జరిగిన సంఘటనలపై గుండెలను మండించే కథలను రాసిన ‘సాదత్‌ హసన్‌ మంటో’ బయోపిక్‌లో కూడా మంటోగా నటిస్తున్నారు.

‘బాల్‌ ఠాక్రే’ సినిమా షూటింగ్‌ మొన్న అంటే, గురువారం సాయంత్రం బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, ఠాక్రే కుమారుడు ఉద్దవ్‌ ఠాక్రే సమక్షంలో ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ సినిమాకు శివసేన పార్లమెంట్‌ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ స్క్రీన్‌ప్లే రచించగా, 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొద్దకాలంపాటు నవ నిర్మాణ సేనలోకి వెళ్లి వచ్చిన శివసేన సభ్యుడు అభిజిత్‌ ఫాన్సే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు