‘కూర్పు’పై గుర్రు

10 Sep, 2019 12:01 IST|Sakshi

మంత్రివర్గ విస్తరణపై నగర నేతల్లో అసంతృప్తి  

బయటకు వెళ్లగక్కిన నాయిని  

అలిగి అసెంబ్లీకి రాని మైనంపల్లి  

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్‌ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి  సోమవారం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కగా... మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మనస్తాపంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బెంగళూర్‌ వెళ్లారు. శాసనసభ ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ఎమ్మెల్సీగానే ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. కానీ తాజా మంత్రివర్గంలో తనను పక్కకు పెట్టడం, ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కాదని, ఇతరులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ మనోగతాన్ని వెల్లడించేందుకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మనస్తాపం చెందారు. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేబినెట్‌ విస్తరణకు ముందు కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సరైన గుర్తింపునిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారని.. తీరా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ముఖ్య పదవుల భర్తీలోనూ తన ప్రాధాన్యతను గుర్తించడం లేదని ఆయన ఆదివారమే బెంగళూర్‌ వెళ్లారు. గ్రేటర్‌లో పార్టీ కోసం కష్టపడే మైనంపల్లికి కనీస గుర్తింపు ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సమంజసం కాదంటూ ఆయన సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేకే మైనంపల్లి బెంగళూర్‌ వెళ్లారని ఆయన సన్నిహితుడొకరు ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు