జమ్మూలో జట్టు కట్టిన కాంగ్రెస్‌, ఎన్సీ

20 Mar, 2019 16:44 IST|Sakshi

కశ్మీర్‌లో కాంగ్రెస్‌, ఎన్సీ మధ్య కుదిరిన పొత్తు

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య పొత్తు చిగురించింది. మొత్తం 6 లోక్‌సభ స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్‌లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌, ఎన్సీ నుంచి ఫరూక్‌ అబ్దుల్లా భేటీలో పాల్గొన్నారు. చర్చల అనంతరం పొత్తు కుదిరినట్లు ఫరూక్‌ ప్రకటించారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయగా, ఒక స్థానంలో ఎన్సీ అభ్యర్థిని నిలపనుంది. జమ్మూ, ఉద్ధాంపూర్ స్థానాల్లో కాంగ్రెస్‌, శ్రీనగర్‌లో ఎన్సీ పోటీ చెయ్యనున్నాయి. అనంతనాగ్, బారాముల్లాలో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ప్రకటించారు.

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ ఫరూక్‌ అబ్దుల్లా పోటీ చెయ్యనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక లడక్ లోక్‌సభ స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఎవరిని పోటీని నిలపాలనే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఇరుపార్టీల ప్రతినిధులు ప్రకటించారు. లౌకిక పార్టీలతో పొత్తు ద్వారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పోటీలోకి దిగుతున్నట్లు ఫరూక్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో బలమైన కూటమి వల్ల సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ఆగడాలను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గెలుపు కోసం ఇరుపార్టీల నాయకులంతా ప్రచారంలో పాల్గొంటారని ఎన్సీ అధినేత తెలిపారు. 


 

మరిన్ని వార్తలు