శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం

11 Mar, 2019 16:00 IST|Sakshi

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి శరద్‌ పవార్‌ (78) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. శరద్‌ పవార్‌  సోమవారం మీడియాతో  మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే  కుటుంబంనుంచి ఇద్దరు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేశారు. తన కుమార్తె సుప్రీయా సూలే, మనువడు పార్థ్‌ పవార్‌  2019 లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ  చేయనున్నారని పేర్కొన్నారు.  

ఈ సారి తన కుటుంబ సభ్యులు ఇద్దరు పోటీ చేయనున్నారు.. కనుక  తాను తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించినపుడు గతంలో 14సార్లు విజయం సాధించాను...15వ సారి తనను నిలువరించడం సాధ్యమా అని ప్రశ్నించారు.  తాజా ప్రకటనతో ఆయన కుటుంబం నుంచి మూడవతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలపై స్పష్టత వచ్చింది. మావల్‌ నియోజకవర్గంనుంచి పార్థ్‌ లోక్‌సభకు పోటీచేస్తారనే అంచనాలు స్థానిక రాజకీయ వర్గాల్లో భారీగా నెలకొన్నాయి.

ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తనకు లేకపోయినా, మధ (మహారాష్ట్ర) నియోజకవర్గంనుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు తనను కోరుతున్నారని, దీంతో ఈ లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. కానీ ఇంతలోనే ఆయన మళ్లీ యూటర్న్‌ తీసుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పవార్‌ విజయం సాధించారు.

2012లో కూడా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్‌ పవార్‌ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత  2014 ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.  ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, ప్రధానమంత్రి పదవి రేసులో ప్రధానంగా నిలిచిన ఆయన ఇక బరిలోనుంచి తప్పుకున్నట్టేనా? ఆయన మనసు మార్చుకోవడం వెనుక వ్యూహం ఏమిటి?

మరిన్ని వార్తలు